వైజాగ్‌ నుంచి పాలన..ఉగాదికే ముహూర్తం

వైజాగ్‌ నుంచి పాలన..ఉగాదికే ముహూర్తం

administrative capital in Visakhapatnam : విశాఖ పరిపాలనా రాజధానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఉగాది నుంచి వైజాగ్‌ నుంచి పాలన సాగుతుందని మంత్రులు చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి‌. రుషికొండలోని ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్‌ రాజధాని నిర్వహణ కోసం సిద్ధమవుతున్నాయి. సాగర నగరం విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు వీలుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఉగాది నుంచి విశాఖలో పాలన సాగుతుందని బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనలకు అనుగుణంగా మౌలికసదుపాయాల కల్పన జరుగుతోంది.

విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్‌లో నగరానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలోని రుషికొండ ఏపీ టూరిజం హరిత కాటేజీలు పాలనా కేంద్రంగా మారే అవకాశం ఉంది. అమరావతి నుంచి తరలివచ్చే ప్రభుత్వం కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. వచ్చే నెల నుంచి ఈ కాటేజీలను ఎవరికీ కేటాయించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీనిలోని విహారి రెస్టారెంట్‌ను కూడా మూసివేయాలని నిర్ణయించింది.

హరిత రిసార్ట్స్‌ ఉన్న రుషికొండ ప్రాంతం 108 ఎకరాల్లో విస్తరించివుంది. ఎకరాల్లో 15 ఎకారాలను అభివృద్ధి చేసి.. 55 కాటేజీలు నిర్మాణం జరిగింది. ఎదురుగా బీచ్‌.. ఎటుచూసినా పచ్చిన కొండలతో ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు రుషికొండ హరిత రిస్టార్స్‌ను పరిశీలించి వెళ్లారు. పరిపాలనా రాజధాని కోసం ప్రైవేటు భూములను తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసిన తరుణంలో హరిత రిసార్ట్స్‌ నుంచి కొంత కాలం పాలన సాగే అవకాశం ఉంది. త్వరలోనే రుషికొండ ఐటీ పార్క్‌లోని భవనాలను కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాపులుప్పాడ తొట్లకొండలోని 30 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద గెస్ట్‌ హైస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది.

ప్రస్తుతం విజయవాడలో ఉన్న రాజ్‌భవన్‌ కూడా విశాఖ తరలిరానుంది. నగరం నడిబొడ్డున ఉన్న వాల్తేర్‌ క్లబ్‌ను గవర్నర్‌ బంగ్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పదమూడు ఎకరాల విస్తీర్ణంలోని వాల్తేర్‌ క్లబ్‌ రాజ్‌భవన్‌కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దానిలోని భవనాలతో పాటు ఖాళీ స్థలం మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. క్లబ్‌ యాజామాన్యం, నిర్వాహకుల మధ్య నడుస్తున్న వివాదానానికి త్వరగా ముగింపు పాలకాలన్న లక్ష్యంతో ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చింది. మొత్తంమీద ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఈ ఏదాడి ఏప్రిల్‌ 13న జరిగే ఉగాది నుంచి విశాఖలో పాలనా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది.