స్థానిక సంస్థల ఎన్నికలు : SEC నిమ్మగడ్డదే తుది నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు : SEC నిమ్మగడ్డదే తుది నిర్ణయం

AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ (SEC) తరఫున ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. అశ్వనీకుమార్ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ అధికారులను వెంటనే ఎస్‌ఈసీ దగ్గరకు పంపించాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్రంలో కరోనా (Corona) పరిస్థితిపై ఎస్ఈసీకి తాజా పరిస్థితులను వివరించాలని సూచించారు. సీనియర్ అధికారులతో సంప్రదింపుల తర్వాత ఎన్నికలపై ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేస్తారని ధర్మాసనం సూచించింది. ఎస్ఈసీ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వం వర్సెస్‌ ఎన్నికల కమిషన్…స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో ఎలాగైనా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. అదే సమయంలో ఎన్నికల నిర్వహణ తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా తీవ్రత తగ్గిందని..ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ అంటోంటే..చలికాలంలో వైరస్ విజృంభించే ప్రమాదముందన్న కేంద్రం హెచ్చరికలను ప్రస్తావిస్తూ….ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు లేఖరాయడం…ఈ లేఖ….ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని నిమ్మగడ్డ బదులివ్వడం…ఈ వ్యవహారంలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. డిసెంబర్ 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సమావేశం నిర్వహించారు.  మార్చి 7న ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలి. తొలిదశలో 333 జెడ్పీటీసీలు, 5వేల 352 ఎంపీటీసీలకు ఎన్నికలకు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.

అప్పటికే 2వేల 129 ఎంపీటీసీ, 125 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే, ఈ ఏకగ్రీవాలన్నిటినీ రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని ఎస్‌ఈసీకి ఫిర్యాదు కూడా చేశాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ అప్పట్లో తప్పు పట్టింది.. ఆ తర్వాత ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుత తరుణంలో… స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.