SSC Inter Exams : ఏపీ హైకోర్టుకు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల పంచాయతీ

ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల రగడ హైకోర్టుకు చేరింది. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

SSC Inter Exams : ఏపీ హైకోర్టుకు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల పంచాయతీ

Ssc Inter Exams

AP ssc‌ and Intermediate‌ examinations : ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల రగడ హైకోర్టుకు చేరింది. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఎన్ని వినతులు సమర్పించినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందులో తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌ ఉద్ధృతంగా ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం.. విద్యార్ధుల ప్రాణాల మీదకు తేవడమేనని విద్యార్ధుల తల్లిదండ్రులు అంటున్నారు. టీడీపీ నేత నారా లోకేశ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశారని, విద్యార్ధుల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు పిటీషన్‌లో దాఖలు చేశారు. విద్యార్ధులే పరీక్షలు వద్దన్న విషయాన్ని కూడా విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపారు. దీంతో న్యాయ పోరాటానికి దిగుతున్నట్టు తెలిపారు.

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యమన్నారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయమని డిమాండ్ చేయడం సులభమని.. కానీ అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఉన్నత చదువల కోసం ప్రయత్నించినా.. ఉద్యోగాల వేటలో ఇంటర్వ్యూకు వెళ్లినా పది, ఇంటర్ పరీక్షల్లో మార్కులే పరిగణలోకి తీసుకుంటారని.. కేవలం సర్టిఫికేట్ పై పాస్ అని ఉంటే వారి భవిష్యుత్తు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి భరోసా కల్పిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ అన్నారు.

సీఎం జగన్ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. జగన్‌కు అంత మొండి పట్టుదల ఎందుకని వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ దీనిపై భారీ ఉద్యమం కూడా చేపట్టింది. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ మొదట సీఎం జగన్, తరువాత గవర్నర్ కు నారా లోకేష్ లేఖలు రాశారు. అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు పరీక్షలను రద్దు చేయాలని తమను కోరారని టీడీపీ నేతలు అంటున్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తోంటే…ఏపీ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని పిల్లలు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు అడుగుతున్నా.. సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పరీక్షలు వల్ల కరోనా వ్యాప్తి ఉధృతమయ్యే ప్రమాదముందని చంద్రబాబు హెచ్చరించారు.

టీడీపీ అధినేతపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే.. ప్రజలను భయపెట్టాలా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి విపత్కర సమయంలో కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. చేతనైతే ప్రభుత్వానికి సహయం అందించాలని, జూమ్‌ మీటింగ్‌లతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని మంత్రి అన్నారు.
ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామ‌ని ప్రభుత్వం చెప్పడంపై కేఏ పాల్‌ మండిపడ్డారు.

కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇత‌ర రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలు వాయిదా వేశాయని గుర్తు చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కేఏ పాల్ తెలిపారు. సీఎం జ‌గ‌న్, ఏపీ మంత్రుల పిల్లలవే ప్రాణాలా? సామాన్యుల పిల్లల ప్రాణాలు పట్టవా అంటూ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మే5 నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 23 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేశ్ అన్నారు.

ఇదిలా ఉండగానే.. ఇంటర్‌ పరీక్షలు నిర్వహణకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం, మే 5 నుంచి ఇంటర్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభించేందుకు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌కు ఆప్షన్‌ ఇచ్చింది. పరీక్షా కేంద్రాలకు ఇప్పటికే ప్రశ్నా పత్రాలు చేరాయి. ఎగ్జామ్‌ రూమ్‌, సీటును ముందుగా చూసుకునేలా యాప్‌ను రూపొందించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని సెంటర్లలో థర్మల్‌ స్కానర్లు, శానిటైజర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

కరోనా పాజిటివ్‌ విద్యార్థులకు ప్రత్యేక రూమ్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు రాయలేకపోయిన వారికి సప్లిమెంటరీలో అవకాశం ఉంటుంది. ఎగ్జామ్‌ సెంటర్లలో ఏర్పాట్లపై నేటి నుంచి తనిఖీలు చేస్తారు అధికారులు. ప్రతి కేంద్రంలో అందుబాటులో ఓ కోవిడ్‌ అధికారి ఉంటాడు. విద్య, వైద్యారోగ్య శాఖ సమన్వయంతో పరీక్షలు జరుగుతాయి.