అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చర్యలకు ఆదేశించాం : హోంమంత్రి సుచరిత

  • Published By: bheemraj ,Published On : November 9, 2020 / 07:01 PM IST
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చర్యలకు ఆదేశించాం : హోంమంత్రి సుచరిత

Nandyala Salam Family Suicide : నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ పై కేసు నమోదు చేశామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పోలీసులు అత్యుత్సాహానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల సలాం ఫ్యామిలీ సూసైడ్ పై హోంమంత్రి సుచరిత, డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించామని తెలిపారు. ఘటనపై సీఎం జగన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం బాధకరమైన విషయమన్నారు.



ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించిన తీరును ముస్లిం మైనారిటీ సంఘాలు కూడా హర్షాతిరేకం వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారని చెప్పారు. వేధింపులపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు..ఫిర్యాదు చేయండి అని తెలిపారు. అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ పోలీసు శాఖలో చాలా వరకు మార్పు తీసుకొచ్చామని చెప్పారు.



కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం ఆటో డ్రైవర్. అతడి కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. షేక్ అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహన్ (38)తో పాటుగా 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు దాదా కలందర్ కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు రైల్వే స్టేషన్‌ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.

సోమవారం అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులకు బెయిల్ మంజూరైంది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కు నంద్యాల కోర్టు సోమవారం (నవంబర్ 9, 2020) బెయిల్ మంజూరు చేసింది. ఫ్యామిలీ సూసైడ్ కు కారణమయ్యారంటూ సీఐ, హెడ్ కానిస్టేబుల్ పైన 323, 506, 509, 306 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే తమ క్లయింట్లకు సెక్షన్ 306 వర్తించదని సీఐ, కానిస్టేబుల్ తరపు లాయర్లు వాదించగా ఏకీభవించిన కోర్టు వారిపై ఆ సెక్షన్ ను తొలగించింది. మిగిలిన సెక్షన్లు బెయిలబుల్ కావడంతో వారికి రూ.10 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.