Covid బాధితురాలిపై అమానుషం..ఇద్దరు కూతుళ్లతో నడిరోడ్డుపై నిలబడ్డి మహిళ

  • Published By: nagamani ,Published On : July 22, 2020 / 01:48 PM IST
Covid బాధితురాలిపై అమానుషం..ఇద్దరు కూతుళ్లతో నడిరోడ్డుపై నిలబడ్డి మహిళ

కరోనా సోకి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికొచ్చిన 103 సంవత్సరాల వృద్ధురాలిని ఇంటియజమానితో పాటు ఇరుగు పొరుగు వారు కూడా ఇంటి ఖాళీ చేయమని వేధించారు.లేదంటే సామాన్లన్నీ బైటపారేస్తానని వేధించిన ఘటన మరువక ముందే ఏపీలో అటువటిదే జరిగింది.

తిరుపతిలో కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుని ఇంటికి వచ్చిన చంద్రకళ అనే మహిళను ఇంట్లోకి రావటానికి వీల్లేదంటూ అడ్డుకున్నాడు యజమాని.దీంతో దిక్కుతోచని స్థితిలో చంద్రకళ తన ఇద్దరు కుమార్తెలతో నడిరోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఇంట్లోకి రానివ్వండీ అంటూ వేడుకుంటూ ఇంటి యజమాని అనుమతి కోసం నడిరోడ్డుపై నిలబడి..పడిగాపులు పడాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే..చంద్రకళ కొన్నేళ్ల నుంచి తన భర్త, ఇద్దరు పిల్లలతో సుందరయ్య నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల చంద్రకళకు కరోనా లక్షణాలు రావటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ కాగా..ఆమె కుటుంబం మొత్తం క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది.అలా 14 రోజులపాటు క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న తర్వాత వారికి నెగటివ్‌గా రిపోర్టు వచ్చింది.

అనంతరం ఇంటికి వచ్చిన చంద్రకళ కుటుంబం పట్ల ఇంటి యజమాని దారుణంగా వ్యవహరించిన తీరుతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంట్లోకి రావద్దంటూ హెచ్చరించాడు. నడిరోడ్డుమీదనే నిలబడి బ్రతిమాలుకున్నా అతను కనికరించలేదు. చంద్రకళ నెగిటివ్ రిపోర్టు చూపించినావైద్య సిబ్బంది వచ్చి నచ్చజెప్పినా వినలేదు. దీంతో నిలబడీ నిలబడీ కాళ్లు పీక్కుపోతుండటంతో కూతుళ్లతో కలిసి చంద్రకళ అక్కడే ఉన్న సిమెంట్ బెంచీపై కూలబడి ఇంటి యజమాని అనుమతి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.