ఇంటర్ సిలబస్ 30శాతం కుదింపు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: naveen ,Published On : August 17, 2020 / 09:06 AM IST
ఇంటర్ సిలబస్ 30శాతం కుదింపు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్‌ సిలబస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున విద్యార్థులకు భారం కాకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి 30శాతం సిలబస్‌ను తగ్గించారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఈ సమాచారం ఉంచారు. ఆయా సబ్జెక్టుల్లో తొలగించిన పాఠ్యాంశ వివరాలను అందులో తెలిపారు.



ఇప్పటికే సీబీఎస్‌ఈ 2020-21 విద్యా సంవత్సరానికి 30శాతం సిలబస్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ఏపీ ఇంటర్ బోర్డు సిలబస్‌ కుదింపు చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా కొన్ని పాఠాలను తొలగించారు. సాధారణంగా 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 5 నుంచి కాలేజీలను ప్రారంభిస్తే 175 వరకు పనిదినాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించారు.



కొవిడ్ 19 నేపథ్యంలో విద్యా సంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో సిలబస్‌ను 30 శాతం మేర కుదించినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్‌ సమాచారాన్ని బోర్డు వెబ్‌సైట్ లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది. లాంగ్వేజ్‌లకు సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో వివరాలు అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇంటర్ 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయా అభ్యర్థుల తాజా మార్కులతో కూడిన షార్ట్‌ మార్కుల మెమోలను కూడా బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది.



ఈ ఏడాది కరోనా వల్ల విద్యావ్యవస్థ మొత్తం అతలాకుతలం అయ్యింది. వాస్తవానికి జూన్ లో ప్రారంభం కావాల్సిన క్లాసులు ఆగస్టు నెల వస్తున్నా అతీగతీ లేదు. సెప్టెంబర్ లో క్లాసులు ప్రారంభిస్తామని చెబుతున్నా, నమ్మకాలు లేవు. ఈ విధంగా చూస్తే సగం విద్యా సంవత్సరం సెలవులతోనే గడిచిపోయేలా ఉంది. దీంతో విద్యా సంవత్సరంలో పూర్తి సిలబస్ చెప్పే అవకాశమే లేకుండా పోయింది. అందుకే ముందుగానే వాటికి సంబంధించిన బోర్డులు సిలబస్ ను కుదిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ఇంటర్ బోర్డు ప్రస్తుతానికి ఇంటర్ సిలబస్ 30 శాతానికి కుదించింది.