AP : నివర్ బీభత్సం..సముద్ర తీరాల్లో బంగారం కోసం వెదుకులాట

  • Published By: nagamani ,Published On : November 27, 2020 / 05:16 PM IST
AP : నివర్ బీభత్సం..సముద్ర తీరాల్లో బంగారం కోసం వెదుకులాట

AP Kakinada-Uppada Coast Gold hunting : తుఫాన్లు వస్తే సముద్ర తీరాల్లో పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రజల్నీ బీచ్ ల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చిరిస్తుంటారు. కానీ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడి సముద్రం అల్లకల్లోలంగా ప్రజల్నీ హడలెత్తిస్తున్న సమయంలో ప్రజలు దాన్నేమీ లెక్కచేయకుండా సముద్ర తీరం వెంట బంగారం కోసం వెదుకులాడుతున్నారు.



చిన్న ముకైనా దొరక్కపోతుందా?అని ఆశతో బంగారం కోసం వేట సాగిస్తున్నారు. ఇంతకీ తుఫాన్లు వస్తే బంగారం దొరుకుతుందా? ఇది నిజమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ భారీ వర్షాలు కురిసి సముద్రం పోటెత్తిన సమయంలో బంగారం ముక్కలు దొరుకుతున్నాయని చెబుతున్నారు.


వివరాల్లోకి వెళితే ఏపీలో ‘నివర్’ తుపానుతో తీర ప్రాంత జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. రహదారులు తెగిపోయాయి. పండించి పంట నీటిపాలవ్వటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో కాకినాడ సముద్రతీరంలో ప్రజలు బంగారం కోసం వేట సాగిస్తున్నారు. చిన్న బంగారం ముక్క దొరికితే చాలు అన్నట్లుగా ఒళ్లంతా కళ్లు చేసుకుని వెదుక్కుంటున్నారు కొంతమంది ఆశావహులు.



కాకినాడ- ఉప్పాడ మధ్యలో పలువురు మత్స్యకారులకు ఇప్పటికే బంగారం ముక్కలు దొరికినట్లుగా చెబుతున్నారు. ఈక్రమంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో బంగారం వేట కోసం తెలంగాణ నుంచి కూడా కొంతమంది ఇక్కడకు వచ్చి వెదుకులాడుతుంటారు.


గత సంవత్సరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు కొందరికి చిన్న చిన్న బంగారం ముక్కలు దొరికాయని అందుకే ఇలా తుపాన్లు వచ్చినప్పుడు సముద్ర తీరాల్లో బంగారం ముక్కలు దొరుకుతాయని చాలామంది అన్నారనీ అందుకే తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వచ్చానని తెలంగాణకు చెందిన ఓ మహిళ తెలిపింది.



సముద్ర తీరంలో బంగారం దొరకడంపై స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వివిధ తుపాన్లు వచ్చినప్పుడు ఏపీలో కాకినాడ-ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న పలు నివాసాలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో అందులో కలిసిపోతున్నాయి. అటువంటి సమయంలో ఇళ్లల్లో దాచుకున్న బంగారం సహా పలు వస్తువులు కొట్టుకుపోతుంటాయి.

ఇక వరదల సమయంలో కూడా అనేక చోట్ల ఇళ్లల్లో వస్తువులు సముద్రంలోకి కొట్టుకు వస్తాయి. వాటిలో విలువైన వస్తువులు కూడా ఉండడంతో వాటిని వెదికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.

అలా భారీ వర్షాలు కురిసినప్పుడు సముద్రం పోటెత్తి అలలు భారీగా తీరంవైపు కొట్టుకొచ్చినప్పుడు కొన్ని బంగారం వస్తువులు, ముక్కలు లాంటివి సముద్ర తీరాల్లో దొరుకుతుంటాయని తెలిపాడు స్థానికుడు.

అలాగే సముద్ర స్నానానికి వచ్చే వారు ఏవో వస్తువులను కోల్పోతుంటారు.వాటిలో ఉంగరాలు, చెవి రింగులు, గొలుసువంటివి జారిపోతుంటాయి. అవి ఇలాంటప్పుడు తీరానికి కొట్టుకొచ్చే అవకాశం ఉంటుందని, వాటి కోసమే ప్రజలు వెతుకులాట కొనసాగిస్తున్నండవచ్చని స్థానికులు అంటున్నారు.