టీచర్ ఐడియా : చెట్లకిందే..చీరల చాటున పాఠాలు..

  • Published By: nagamani ,Published On : November 6, 2020 / 02:22 PM IST
టీచర్ ఐడియా : చెట్లకిందే..చీరల చాటున పాఠాలు..

AP teacher Idea ensure social distance by using sarees : కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గనంటోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ దాని విశ్వరూపాన్నిచూపిస్తోంది. దీంతో బడులు తెరవాలంటేనే టీచర్లు..విద్యార్దులు..వారి తల్లిదండ్రులు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. కానీ చదువులు సాగాలి..కానీ ఒక పక్క కరోనా భయం..మరోపక్క ఆగిపోతున్న చదువులు. ఏం చేయాలో తెలీని అయోమయ పరిస్థితి. అయినా సరే ఏపీ ప్రభుత్వం నిబంధనలతో కూడిన షరతులతో స్కూల్స్ తెరవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఏపీలో నాలుగు రోజుల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి.



తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు స్కూల్స్ కు వచ్చారు. టీచర్లు కూడా వచ్చారు. స్కూళ్లలో జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. అయినా కరోనా టెన్షన్ వదల్లేదు. స్కూల్స్ ఓపెన్ చేశాక విద్యార్ధులతో పాటు టీచర్లు కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.విద్యాశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 70,790 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా వీరిలో 829 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 95,763 మంది విద్యార్థులను పరీక్షించగా 575 మందికి వైరస్ ఉన్నట్లుగా తేలింది.



ఏపీలో కరోనా వ్యాప్తితో స్కూల్ కు రావాలంటేనే విద్యార్దులతో పాటు టీచర్లుకూడా భయపడతున్నారు.కానీ తప్పదు. ఈ క్రమంలో విద్యార్దులు భయపడకుండా చదువుకోవటానికి రావాలంటే ఏదోకటి చేయాలని అనుకున్నారు కర్నూలులోని ఓ స్కూల్లో టీచర్ విద్యార్దులు కరోనాబారిన పడకుండా క్లాస్‌ను ఆరు బయట చెట్లకింద ఏర్పాటు చేశారు. విద్యార్దుల్ని లైన్లుగా కూర్చోబెట్టారు. ఆ వరుసల మధ్యలో దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్ధుల మధ్యలో చీరల్ని అడ్డుగా కట్టారు. ఆచీరలు తగలకుండా కూర్చోవాలని సూచించారు. దీంతో విద్యార్ధులు చక్కగా చదువుకుంటున్నారు. టీచర్‌కు వచ్చిన ఐడియాకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.



కాగా..పలు ప్రాంతాల్లో టీచర్లు విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వినూత్న రీతిలో ఆలోచిస్తు పాఠాలుచెబుతున్నారు. ఓ టీచర్ పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు చెబుతుండగా సిగ్నల్స్ సరిగా లేకపోవటంతో చెట్టు ఎక్కి కూర్చుకుని పాఠాలు చెబుతుంటే..మరో ప్రాంతంలో మరో టీచర్ విద్యార్ధులను గ్రామంలోని ఇళ్ల అరుగులపై కూర్చోపెట్టి ఆ ఇంటి గోడల్నే బ్లాక్ బోర్డుగా మార్చి పాఠాలు చెబుతున్నారు. మరో టీచర్ గ్రామంలో ఉండే గ్రామ సచివాలయం మైక్ లో పిల్లలకు పాఠాలు చెబతున్నారు. ఇలా తమ బాధ్యత పట్ల అంకిత భావంతో పనిచేసే చాలామంది టీచర్లు ఈ కరోనా సమయంలో వినూత్నంగా ఆలోచిస్తూ పాఠాలు చెబుతున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.