కేంద్రం సహకరిస్తేనే మండలి రద్దు.. లేదంటే ఆపరేషన్‌ ఆకర్షే ముద్దు!

  • Published By: sreehari ,Published On : February 20, 2020 / 05:20 PM IST
కేంద్రం సహకరిస్తేనే మండలి రద్దు.. లేదంటే ఆపరేషన్‌ ఆకర్షే ముద్దు!

ఏపీ శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసేసింది. తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకొని పార్లమెంటులో ఆమోదించాల్సి ఉంది. ఇది ఎంత కాలం పడుతుందన్న విషయం క్లారిటీ లేదు. ఒకవేళ శాసనమండలి ఇప్పుడిప్పుడే రద్దయ్యే అవకాశాలు లేకుంటే ప్రత్యామ్నాయం ఏం చేయాలనే అంశంపై వైసీపీ దృష్టి పెట్టిందని అంటున్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది. తాము అనుకున్నది నెరవేర్చుకునే వరకూ విడిచిపెట్టకూడదని డిసైడ్‌ అయ్యిందని చెబుతున్నారు. మండలి చైర్మన్‌పై గుర్రుగా ఉన్న సర్కారు.. ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనకూడా చేస్తోందట.

పాలనా వికేంద్రీకరణ బిల్లుతో సీఆర్‌డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించింది. మండలిలో ఆమోదం కోసం అక్కడకు పంపించింది. మండలిలో బలం ఉన్న టీడీపీ దానిని అడ్డుకుంది. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్‌ విచాక్షణాధికారం పేరుతో నిర్ణయం తీసుకున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ సర్కారు.. ఎలాగైనా పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. అందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. మండలి రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. 

చైర్మన్ పై అవిశ్వాసం :
మండలి చైర్మన్‌ షరీఫ్‌పై గుర్రుగా ఉన్న ప్రభుత్వం.. ఆయనను గద్దె దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని అంటున్నారు. నిజానికి మండలిలో వైసీపీకి మెజారిటీ లేదు. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బలం అవసరం. అందుకే ఆ దిశగా పావులు కదిపేందుకు సన్నాహాలు చేస్తోందని ప్రచారం సాగుతోంది.

తమతో కలిసొచ్చే శాసనమండలి సభ్యులను ఇతర పార్టీల నుంచి ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులతో పాటు, మరికొందరిని కూడా తమ వైపు రావాలని కోరుతోందని చెబుతున్నారు. సభ్యుల మద్దతు కూడగట్టుకొని, సరిపడా సంఖ్యాబలం ఉందని భావిస్తే.. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలనే ఓ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు. 

బిల్లు తీసుకొస్తే.. ఆపరేషన్ ఆకర్ష్ :
కేంద్ర ప్రభుత్వం మండలి రద్దు కోసం పార్లమెంటులో బిల్లు తీసుకొస్తే మాత్రం ఆపరేషన్‌ ఆకర్ష్‌ను పక్కనపెట్టేయొచ్చు. కానీ బిల్లు పాస్‌ కావాలంటే రాజ్యసభలో కూడా మద్దతు అవసరం. అక్కడ ఎన్డీయేకు పూర్తి స్థాయి మెజారిటీ లేదు. అందుకే అక్కడ బిల్లు పెండింగ్‌లో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన పంతం నెగ్గించుకోవడం కోసం మండలి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు వీలుగా ఇతర పార్టీ సభ్యులను ఆకర్షించడమే సరైన చర్యగా వైసీపీ సర్కారు భావిస్తోంది. మరి వైసీపీ కోరుకుంటున్నట్టుగా ఎంత మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.