మండలిలో సెలెక్ట్ కమిటీ రగడ: రెండోసారి ఫైల్ వెనక్కి.. టీడీపీ సీరియస్!

  • Published By: sreehari ,Published On : February 14, 2020 / 03:20 PM IST
మండలిలో సెలెక్ట్ కమిటీ రగడ: రెండోసారి ఫైల్ వెనక్కి.. టీడీపీ సీరియస్!

ఏపీ శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ  రగడ కొనసాగుతోంది. సెలెక్ట్ కమిటీ ఫైల్‌ను శాసన మండలి సెక్రటరీ రెండోసారి వెనక్కి పంపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మరోసారి తేల్చిచెప్పారు. మండలి కార్యదర్శి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుబడుతోంది. 

శాసన మండలిలో సెలక్ట్ కమిటీల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. 48 గంటల్లో సెలక్ట్ కమిటీ ఫైల్ పంపని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చైర్మన్ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. సెక్రటరీ సెలక్ట్ కమిటీ ఫైల్ ను మరోసారి తిరిగి పంపించారు. నిబంధనల ప్రకారంగా లేదని సెలక్ట్ కమిటీలను ఇవ్వడానికి సాధ్యం కాదని సెక్రటరీ రెండోసారి ఫైల్ రిజెక్ట్ చేశారు. 

దీనిపై టీడీపీ కూడా సీరియస్ గా స్పందిస్తోంది. సెలక్ట్ కమిటీ ఫైల్ తిరిగి వెనక్కి పంపడం సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, సభ్యులు ఎవరైనా దీనిపైనా నోటీసు ఇవ్వొచ్చునని, క్రమశిక్షణ చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్ కు ఉందని టీడీపీ చెబుతోంది.

పార్టీ పరంగా కూడా  దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు జరిగినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది అంటున్న టీడీపీ.. మండలి కార్యదర్శి నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

సెలక్ట్ కమిటీ ఫైల్ ను వెనక్కు పంపడం సభా నియమాల ఉల్లంఘనే అని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా కఠిన నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్ కు ఉందని ఆయన అన్నారు. 

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు