Anil Kumar Yadav : తెలుగు దేశం పార్టీ కాదు తెలంగాణ దేశం పార్టీ

టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. కులాలు, మతాలు మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.

Anil Kumar Yadav : తెలుగు దేశం పార్టీ కాదు తెలంగాణ దేశం పార్టీ

Anil Kumar Yadav

Anil Kumar Yadav : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాజెక్టును ఆపేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం ఆ కోవలోకే వస్తుందని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు లేఖ రాయడం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందని మంత్రి ఆరోపించారు.

చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తడం లేదని విమర్శించారు. తాజా పరిణామాలు పరిశీలిస్తే టీడీపీ ‘తెలంగాణ దేశం పార్టీ’గా మారిపోయిన విషయం అర్థమవుతుందని అన్నారు.

తెలంగాణలో అన్ని పార్టీలు ఒకే మాటపైకి వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలో మాత్రం టీడీపీ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌లు కట్టారని మంత్రి గుర్తుచేశారు. సీఎం జగన్ మాత్రం చంద్రబాబులా కాకుండా .. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.