షరీఫ్ లాంటి చైర్మన్ తో రాజ్యాంగానికి ఇబ్బంది…బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు

  • Published By: venkaiahnaidu ,Published On : January 22, 2020 / 04:15 PM IST
షరీఫ్ లాంటి చైర్మన్ తో రాజ్యాంగానికి ఇబ్బంది…బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు

ఏపీ శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీయే రద్దు,అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును విచక్షణ అధికారాలతో సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బొత్స తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇవాళ జరిగిన పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చట్టం,రాజ్యాంగం అనుగుణంగా వెళ్లాలని రెండు రోజులుగా మండలి చైర్మన్ షరీఫ్ కు చెబుతూను ఉన్నామని,కానీ చంద్రబాబు చెప్పినట్లే చైర్మన్ చేశారని బొత్స తెలిపారు. సెలక్ట్ కమిటీకి పంపడానికి ఎంత మంది ఆమోదిస్తారని స్పీకర్ అడగలేదన్నారు.

ఇలాంటి వాళ్లు చైర్మన్ గా ఉంటే రాజ్యాంగానికి ఇబ్బంది అని అన్నారు. బిల్లుల ఆమోదం ఆలస్యం చేయవచ్చు కానీ ఆపలేరన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు పార్టీలకతీతంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వానికి కూడా విచక్షణాధికారం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏం చేయడానికి టీడీపీ ఇలా చేసిందని బొత్స ప్రశ్నించారు. బిల్లుపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలేగానీ,బిల్లులు జాప్యం చేస్తే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని బొత్స ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం ఎంతో తాపత్రయపడ్డారని అన్నారు. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ విధానమని బొత్స అన్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలన్న రాక్షస ఆలోచనలో టీడీపీ ఉందన్నారు. టీడీపీది ఓ నీతిమాలిన కార్యక్రమమని బొత్స విమర్శించారు.

ఈ రోజు ఎంతో బాధతో కూడిన రోజు అని మంత్రి బుగ్గన అన్నారు. ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు ఇదని బుగ్గన అన్నారు. చట్టసభలకు గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించిందన్నారు. చంద్రబాబు నేరుగా మండలి చైర్మన్ ను ప్రభావితం చేశారన్నారు. సభలో యనమల వ్యవహరించిన తీరు సరికాదన్నారు. బీఏసీ అజెండాను యనమల బుల్డోజ్ చేశారన్నారు. బిల్లును ప్రవేశపెడతామంటే రూల్ 71ను తీసుకొచ్చి అడ్డుకున్నారన్నారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే ముందుగా మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబును చూస్తూ విచక్షణాధికారమంటూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. శాసనమండలిని నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ మండలి చైర్మన్ ఇవాళ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంలో 3నెలలపాటు బిల్లుల ఆమోదం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.