ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల సరికాదు-బొత్స

ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల సరికాదు-బొత్స

AP Minister Bothsa Satyanarayana angry with SEC Nimmagadda Ramesh : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదల చేయడంపై వైసీపీ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ పంపిణీకి సన్నదమవుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఈసీకి అధికారంతోపాటు బాధ్యతలు కూడా ఉంటాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం (జనవరి 10, 2021) బొత్స మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు.

కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని ప్రధాని ప్రకటించారని మంత్రి బొత్స పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ కూడా వేశామని తెలిపారు. ఎన్నికల సంఘానికి అధికారంతో పాటు హద్దులు ఉంటాయిని చెప్పారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

అధికార యంత్రాంగం వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతుంది..ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఎవరికి ప్రయోజనం కల్పించడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేయాలని సీఎస్‌ కోరినా ఎందుకీ మొండి పట్టుదల అని నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం ముదురుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది కరెక్ట్ టైం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ పరిస్థితుల్లో… జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.

ఎస్ఈసీ నోటిఫికేషన్‍‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై సోమవారం పూర్తి స్థాయిలో విచారించనుంది.