ఉచిత విద్యుత్ శాశ్వతం.. ఎకరం సాగుచేయని వాళ్లే ఉచిత విద్యుత్ పై చిటికెలేస్తున్నారు – కొడాలి నాని ఫైర్

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 01:34 PM IST
ఉచిత విద్యుత్ శాశ్వతం.. ఎకరం సాగుచేయని వాళ్లే ఉచిత విద్యుత్ పై చిటికెలేస్తున్నారు – కొడాలి నాని ఫైర్

Kodali Nani on Free Power: రైతుల గురించి తెలియనవాళ్లే ఉచిత విద్యుత్ ను తప్పుపడుతున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. ఉచిత విద్యుత్ శాశ్వతంగా ఉండటానికే పదివేల మెగావాట్ల పవర్ గ్రిడ్ ను ఎర్పాటు చేస్తోంది. ఇది పూర్తిగా రైతాంగం కోసమే. దీనివల్ల కరెంట్ రేట్ సగానికి తగ్గుతుందని చెప్పారు.

2020, సెప్టెంబర్ 04వ తేదీ శుక్రవారం మంత్రి కొడాలి నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఉచిత విద్యుత్ పై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రైతులు, డిస్కం, ప్రభుత్వం ఉమ్మడిగా అగ్రిమెంట్ చేసుకొంటాయని, ఇలా చేయడం వల్ల ప్రతి నెల రైతు వాడే కరెంట్ బిల్లు నేరుగా ప్రభుత్వానికే వెళ్తుందని వివరించారు.

రైతుకు బిల్లుకు సంబంధం లేదని, ప్రభుత్వమే కడుతుందని మరోమారు స్పష్టం చేశారు. ఆ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వమే ఆయా రైతుల అకౌంట్లలో వేస్తుందని, ఆ మొత్తం డిస్కంకు వెళ్లడం వల్ల..ప్రభుత్వమే సరాసరి రైతుల బిల్లును కడుతుందని తెలిపారు నాని.

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హాయంలో బాబు రైతులను గాలికొదిలేశారని, డిస్కంలకు అప్పులను మిగిల్చారని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇలా జరగకూడదనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు కొడాలి నాని. పగటి పూట 9 గంటల విద్యుత్ నిరంతరంగా, శాశ్వతంగా అందాలనే జగన్ సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

రైతులు ఎవరూ ఉచిత విద్యుత్ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు కానీ బాబు ఒక్కనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి, ఫలితాల ఆధారంగా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని తెలిపారు.

ఉచిత విద్యుత్ కు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లకు ఎవరికీ ఎకరం భూమి లేదు..ఉచిత విద్యుత్ వాడటం లేదు.. బాబు దళారి. ఆయన ఎకరం కూడా వ్యవసాయం చేయరు.. ఇప్పుడు ఆయనకు రైతులపై ఉత్తుత్తి ప్రేమ పుట్టుకొచ్చిందని ఘాటుగా విమర్శించారు. రైతులు వైఎస్సార్ ని నమ్మారు, జగన్‌ను నమ్మారని అన్నారు మంత్రి కొడాలి నాని.