AP Municipal Election Results 2021 : ఫ్యాన్ గాలికి సైకిల్ పంక్చర్, గ్లాసు పగిలింది, పువ్వు మాడింది

ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే. అంచనాలకు మించి విజయాలు సాధించింది వైసీపీ.

AP Municipal Election Results 2021 : ఫ్యాన్ గాలికి సైకిల్ పంక్చర్, గ్లాసు పగిలింది, పువ్వు మాడింది

Ysrcp

AP Municipal Election : పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ప్రతి ఓటరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసారా అన్న సందేహం కలుగుతోంది ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే. అంచనాలకు మించి విజయాలు సాధించింది వైసీపీ. ఆ జిల్లా..ఈ జిల్లా అన్న తేడా లేదు..ఆ వార్డూ.. ఈ వార్డు అన్న బేధం లేదు…ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా…ఏపీ ఓటర్లంతా ఫ్యాన్‌కే పట్టం కట్టారు. ఫ్యాన్ గాలి స్పీడుకు మిగిలిన పార్టీలు కకావికలమయ్యాయి. ప్రతిపక్ష టీడీపీ ఇప్పటిదాకా ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది.

దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ ఏకపక్ష విజయాలు సాధించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్ని వార్డుల్లో గెలుపుకు మాత్రమే పరిమితమైంది టీడీపీ. ఇక బీజేపీ-జనసేన కనీస ప్రభావం చూపలేకపోయాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది వైసీపీ. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల్లో మొత్తం మున్సిపాలిటీలనూ వైసీపీ గెలుచుకుంది. ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి, చీరాల, అద్దంకి, మార్కాపురం మున్సిపాలిటీలను, ఒంగోలు కార్పొరేషన్‌ను గెలుచుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట, సూళ్లూరు పేట, వెంకటగిరి, ఆత్మకూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ 95శాతం విజయాలు నమోదు చేసింది వైసీపీ. కడప జిల్లా రాయచోటి, పులివెందుల, ప్రకాశం జిల్లా కనిగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అన్ని వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్ధులే విజయం సాధించారు.

శ్రీకాకుళం జిల్లా పలాస, పాలకొండ, ఇచ్ఛాపురం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల, విశాఖ జిల్లా యలమంచిలి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి, వినుకొండ, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, ఆత్మకూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం, పుట్టపర్తి, మడకశిర, చిత్తూరు జిల్లా పలమనేరు, మదనపల్లి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా తుని, రామచంద్రాపురం మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లాలో వైసీపీకి ఎదురులేకుండా పోయింది. కడప కార్పొరేషన్‌ వైసీపీ వశమైంది. 50 డివిజన్లకు గతంలోనే 24 డివిజన్లు ఆ పార్టీకి ఏకగ్రీవమైతే మరో నాలుగింటిని గెలుచుకుంది. మిగతా డివిజన్లలోనూ ఆధిక్యత కనబరుస్తోంది. జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. పులివెందుల మున్సిపాలిటీ వైసీపీకి ఏకగ్రీవమైంది. రాయచోటి మున్సిపాలిటీలో అధికారపార్టీ జెండా ఎగరేసింది. 34 వార్డుల్లో 31 ఇదివరకే ఆ పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. తాజా ఫలితాల్లో మిగిలిన మూడు వార్డులను గెల్చుకుంది. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో క్లీన్‌ స్వీప్‌ చేసింది వైసీపీ. 20 వార్డులకు 13 గతంలోనే ఏకగ్రీవమైతే ఇప్పుడు మరో 7 చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.

కార్పొరేషన్లలోనూ వైసీసీ హవా కొనసాగుతోంది. ఒంగోలు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు కార్పొరేషన్లను వైసీసీ గెలుచుకుంది. ఒంZగోలులో వైసీపీ 41 స్థానాల్లో గెలిచింది. టీడీపీ ఆరు చోట్ల, జనసేన ఒక చోట గెలుపొందాయి. రెండు వార్డుల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు గెలుపొందారు. గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీ 31 వార్డుల్లో విజయం సాధించింది. టీడీపీ ఆరు వార్డుల్లో, జనసేన రెండు వార్డుల్లో గెలిచాయి. చిత్తూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 వార్డులుండగా వైసీపీ అభ్యర్ధులు 37 చోట్ల గెలుపొందారు. తిరుపతిలో మొత్తం 49 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 22 వార్డులను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ 26 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ ఒక స్థానంలో గెలిచింది. బీజేపీ-జనసేన అభ్యర్ధులు తిరుపతిలో ఒక వార్డులోనూ గెలుపొందలేకపోయారు. విజయవాడలో వైసీపీ 11 చోట్ల గెలుపొందింది. టీడీపీ అభ్యర్ధులు 8 వార్డుల్లో జనసేన అభ్యర్ధి ఒక వార్డులో గెలుపొందారు.