AP Municipal Election Results 2021 : వైసీపీ జోరు, టీడీపీ, బీజేపీ – జనసేన, కాంగ్రెస్ గల్లంతు

పల్లెల్లో పక్కాగా పాగా వేసిన అధికార వైసీపీ... అంతకు మించి అనే రేంజ్‌లో పట్టణాల్లోనూ సత్తా చాటింది.

AP Municipal Election Results 2021 : వైసీపీ జోరు, టీడీపీ, బీజేపీ – జనసేన, కాంగ్రెస్ గల్లంతు

Ysrcp Win (1)

AP Municipal Elections 2021 Results : పంచాయతీ ఎన్నికలకు మించిన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో వస్తున్నాయి. పల్లెల్లో పక్కాగా పాగా వేసిన అధికార వైసీపీ… అంతకు మించి అనే రేంజ్‌లో పట్టణాల్లోనూ సత్తా చాటింది. పల్లెలకు మించి పట్టణాలు, నగరాలను గంపగుత్తగా ఖాతాలో వేసుకుంది. 71 మున్సిపాలిటీల్లో ఇప్పటి ఎక్కువ 42 మున్సిపాలిటీలనూ కైవసం చేసుకుని.. గ్రామాల్లోనే కాదు.. నగరాల్లోనూ తిరుగులేదని నిరూపించుకుంది. వైసీపీ ఫ్యాన్ గాలి బీభత్సంగా వీస్తుండటంతో… టీడీపీకి చెందిన సైకిల్ ఏ పార్ట్‌కు ఆ పార్ట్‌గా తుక్కు తుక్కైంది. ఇక.. కమలం పార్టీతో జతకట్టిన పవన్ పార్టీ.. ఎలాంటి ప్రభావం చూపించకుండా పత్తా లేకుండా పోయింది. ఒక్క అమలాపురం మున్సిపాలిటీలో తప్ప… ఏపీలోని ఏ ప్రాంతంలో కూడా జనసేన అభ్యర్థులు పోటీ ఇవ్వలేకపోయారు. ఇక బీజేపీ సంగతి సరేసరి. ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి.. 2024లో అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కమలం పార్టీ.. అసలు అడ్రస్ లేకుండా పోయింది. ఒక్క మున్సిపాలిటీలో కూడా కమలం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఒక రకంగా వైసీపీ ఫ్యాను గాలి హోరులో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

ఫలితం మాదే అన్నట్లు : –
ఎన్నిక ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా.. ఫలితం మాదే అన్నట్లుగా ఉంది వైసీపీ పరిస్థితి. అధికార పార్టీ దూకుడు ముందు ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని చోట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అవ్వగా.. నాలుగైదు సీట్లకు జనసేన -బీజేపీ కూటమి పరిమితం అవుతోంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులు సింగిల్ డిజిట్‌ స్ధానాలు కైవసం చేసుకుంటున్నాయి. ఏపీలో ఈ నెల 10న జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి.. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం లెక్కింపు ప్రారంభం కాగా తాజా ఫలితాలు వెలువడే సరికి… వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. రాష్టవ్యాప్తంగా పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వైసీపీ ఇప్పటికే మెజారిటీ స్ధానాలు కైవసం చేసుకుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది వైసీపీ.

క్లీన్ స్వీప్ : –
వైసీపీ గెల్చుకున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి, కర్నూలు జిల్లాలోని డోన్‌, ఎమ్మిగనూరు, గూడూరు, నందికొట్కూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, నాయుడుపేట, అనంతపురం జిల్లా మడకశిర, కడప జిల్లా రాయచోటి, ఎర్రగుంట్ల, శ్రీకాకుళం జిల్లా పలాస, తూర్పుగోదావరి జిల్లా తుని, చిత్తూరు జిల్లా మదనపల్లె, గుంటూరు జిల్లా వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ఉన్నాయి. కనిగిరి, రాయచోటిలో అయితే అన్ని వార్డుల్నీ దక్కించుకుని వైసీపీ క్లీన్ స్వీప్‌ చేసింది.

చేతులెత్తేసిన పార్టీలు : –
అటు కార్పోరేషన్ ఫలితాల్లోనూ వైసీపీ సత్తా చూపుతోంది. ఏలూరు కార్పోరేషన్‌ మినహాయిస్తే మిగిలిన కార్పోరేషన్లలో వైసీపీ అధిక్యం సాగుతోంది. కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, ఒంగోలు కార్పోరేషన్లు వైసీపీ ఖాతాలో చేరిపోయాయి. మిగతా కార్పొరేషన్లలో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. విజయవాడ, గుంటూరు, విశాఖ సహా పలు కార్పోరేషన్లలో హోరాహోరీ ఎన్నికలు జరిగాయని భావించినా.. అక్కడా కూడా వైసీపీ స్పష్టమైన ఆధిక్యం చూపుతోంది. దీంతో దాదాపుగా అన్ని కార్పోరేషన్లనూ వైసీపీ గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొంటామని సవాళ్లు చేసిన టీడీపీ, బీజేపీ-జనసేన కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసాయి.