AP News Today: ఏపీ న్యూస్ టుడే.. సంక్షిప్త వార్తలు

AP News Today: ఏపీలో నేటి విశేషాలపై సంక్షిప్త వార్తలు..

AP News Today: ఏపీ న్యూస్ టుడే.. సంక్షిప్త వార్తలు

AP News Today

AP News Today: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోరుబాటలో పాల్గొననున్నారు. జనసేన పార్టీ సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిగూడెంలో ఏపీ గవర్నర్ పర్యటించనున్నారు. ఏపీలో నేటి విశేషాలపై సంక్షిప్త వార్తలు ఇవిగో..

చంద్రబాబు రైతు పోరుబాట
పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రైతు పోరుబాట పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతుల తరఫున ప్రభుత్వంపై పోరుబాట పేరిట తణుకు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు.

అన్నదాతలతో కలిసి 12 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేపట్టారు చంద్రబాబు. ఇరగవరం గ్రామం నుంచి తణుకు వరకు పాదయాత్ర ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు గ్రామాల మీదుగా సాగనున్న పాదయాత్ర చేస్తారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా పంట నష్ట ప్రాంతాల్లో పర్యటించారు.

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చేసిన డిమాండ్ పై ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరుబాటకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యంపై నిరసనగా భారీ స్థాయిలో రైతు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయక పోవడం పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతు పోరుబాటను కొనసాగిస్తారు.

అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వాణిజ్య, ఉద్యాన, ఆహార పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. నిన్న సాయంత్రమే ఇరగవరం చేరుకుని రైతులతో చంద్రబాబు రచ్చబండ నిర్వహించారు. నేటి సాయంత్రం తణుకులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.

తాడేపల్లిగూడెంలో ఏపీ గవర్నర్ పర్యటన
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.

కావలిలో జగన్ పర్యటన

చుక్కల భూములకు యాజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్. జిల్లాలో 23 వేల మంది రైతులకు 43 వేల 270 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు కల్పించనున్నారు. కావలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాద రావు, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

జీవో నెంబర్-1పై హైకోర్టు తీర్పు
ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ ఏడాది జనవరి-2న ప్రభుత్వం జీవో నెంబర్-1 తీసుకురాగా.. దీన్ని సవాలు చేస్తూ అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పును రిజర్వ్ చేసింది.

జనసేన సమావేశం
జనసేన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశం శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజాపక్షం వహిస్తూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు.

మహానాడు ప్రాంగణానికి భూమి పూజ

రాజమహేంద్రవరం లో మహానాడు ప్రాంగణానికి భూమి పూజ చేయనున్నారు. వేమగిరిలో ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహనాడును నిర్వహిస్తారు. నేటి భూమి పూజ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొంటారు.

రైతులను అడ్డుకున్న పోలీసులు
తణుకులోని ఇరగవరం దారిలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తడిచిన ధాన్యం చూపించేందుకు రైతుల రాబోయారు. పక్క గ్రామాల నుంచి పంటను ఇక్కడికి తీసుకువచ్చి శాంతి భద్రతలకు విగూతం కలిగిస్తున్నారంటూ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తడిచిన ధాన్యాన్ని ట్రాక్టర్లలోకి ఎత్తి బయటకు పంపించారు పోలీసులు.

4 ఏనుగులు మృతి
మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ సమీపంలో విద్యుత్ షాక్ కు గురై నాలుగు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. బొకన్న చెరువు దగ్గరలో ఏనుగులు ట్రాన్స్‌ఫార్మర్ ను ధ్వంసం చేశాయి. ఈ నేపధ్యంలోనే వాటికి షాక్ తగిలింది. అలాగే, మరో రెండు ఏనుగులు తివ్వా కొండలపైకి వెళ్లినట్టు సమాచారం.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న శ్రీవారిని 67,853 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లుగా నమోదైంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల వరకు క్యూ లైన్లు కనపడ్డాయి. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.

ప్రయాణికురాలి పై డ్రైవర్ అత్యాచారం
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో దారుణం జరిగింది. తన ఆటోలో ఎక్కిన ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. కొల్లూరు మండలం క్రీస్తులంక వెళ్లేందుకు తెనాలిలో ఆటో ఎక్కింది ఓ మహిళ. మార్గమధ్యంలో ముసలిపాడు వద్ద ఆటోను డ్రైవర్ పొలాల్లోకి తీసుకెళ్లాడు. మహిళపై అత్యాచారం చేసి, రూ.30 వేల నగదు, ఉంగారం లాక్కుని పరారయ్యాడు. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Prithviraj Sukumaran : తప్పుడు వార్తలు రాసినందుకు… యూట్యూబ్ ఛానల్ పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్న స్టార్ హీరో..