ఏపీ పంచాయతీ ఎన్నికలు..నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ఏపీ పంచాయతీ ఎన్నికలు..నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరి ఫస్ట్‌ ఫేజ్‌లో ఎన్ని మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి..? ఎన్ని గ్రామాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు..? ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ తీసుకుంటున్న చర్యలేంటి..? వాచ్‌ ది స్టోరీ…

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నాలుగు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ఇవాళ్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 మండలాల్లోని దాదాపు 4 వేల గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 31తో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తికానుంది. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు.

ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 9న ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర పోలింగ్‌.. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 7గంటల లోపు ఫలితాలను వెల్లడిస్తారు.

తొలి విడతలో ఎన్నికలు జరిగే మండలాలను చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాలకు.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 21 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 12 మండలాలకు.. కృష్ణా జిల్లా విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్లో 18 మండలాలు.. ప్రకాశం జిల్లా ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో 15, నెల్లూరు జిల్లా కావలిలో 10 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 12 మండలాలకు.. అనంతపురం జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో 11.. కడప జిల్లా జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్లలో 14.. చిత్తూరు జిల్లా చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో21 మండలాలకు ఫస్ట్‌ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇక కొన్ని పంచాయతీల ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల కమిషన్‌ స్వల్ప మార్పులు చేసింది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయతీల్లో మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్‌లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన మండలాలకు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నాల్గవ దఫాలో ఎన్నికలు జరపనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.

మరోవైపు పంచాయతీ ఎన్నికల సమరానికి యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు పోలింగ్ బాక్సులతో పాటు సామాగ్రిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కార్యాలయాల్లోని బ్యాలెట్‌ బాక్సులను అధికారులు మరమ్మతులు చేసి సిద్ధం చేశారు. ఓటర్ల సంఖ్యను బట్టి.. జిల్లా కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు.

ఇక పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పెషల్‌ ఫోకష్ పెట్టారు. నామినేషన్లు, ఎన్నికల నేపథ్యంలో.. రెండ్రోజుల పాటు రాష్ట్రంలో ఆయన పర్యటించనున్నారు. ఇవాళ, రేపు, ఆయన పలు జిల్లాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. రెండో రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ అనంతపురం, కర్నూల్‌ జిల్లాలో పర్యటించనున్న ఎస్‌ఈసీ.. రేపు కడప జిల్లాలో అధికారులతో సమావేశం కానున్నారు.