పంచాయతీ ఎన్నికలు, అధికార పార్టీ ప్రభంజనం

పంచాయతీ ఎన్నికలు, అధికార పార్టీ ప్రభంజనం

AP Panchayat elections : ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభంజనం కొనసాగింది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. కౌటింగ్ సమయంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. చివరికి ఫలితాల్లో అధికార పార్టీ మద్దతుదారుల హవా కనిపించింది. ఓవరాల్‌గా వైసీపీ మద్దతు దారులు 2 వేల 336 మంది విజయం సాధించగా.. టీడీపీ మద్దతు దారులు 503 చోట్ల గెలుపొందారు.

బీజేపీ జనసేన కూటమి, ఇతర పార్టీలు 47 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. స్వతంత్య్ర అభ్యర్థులు 72 మంది విజయం సాధించారు. గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం 50 సీట్లకు పైగా సాధించి రేసులో నిలిచింది. మిగిలిన అన్ని చోట్ల కనీసం అధికార పార్టీకి పోటీ ఇవ్వలేకపోయింది. ఓవారల్‌గా చూస్తే తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ అంత ప్రభావం చూపించలేకపోయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో జరిగిన ఎన్నిక చాలా ఆసక్తి పెంచింది. 40 ఏళ్ల తరువాత ఇక్కడ ఎన్నికలు జరిగ్గా టీడీపీ అభ్యర్థి కింజారపు సురేష్ 17 వందల ఓట్లతో విజయం సాధించారు.
మూడు, నాలుగు జిల్లాలు మినహా అన్నింటా 75 శాతానికి పైగా విజయాలు అధికారపార్టీ ఖాతాలోనే పడ్డాయి.

ఇక ఎన్నిక ఏదైనా జీరోతో సరిపెట్టుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు బోణీ చేసింది. ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల్లో ఒక సీటును సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో చివరికి కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించాడు.