ఏపీ పంచాయతీ తొలి విడత నామినేషన్లు పూర్తి

10TV Telugu News

AP Panchayat first Phase : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిసింది. 3 వేల 249 పంచాయతీలు, 32, 504 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి రోజు 1,317 సర్పంచ్ అభ్యర్థులు, 2 వేల 200 వార్డు మెంబర్ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు 7 వేల 400 సర్పంచ్, 23 వేల 318 అభ్యర్థులు వార్డు మెంబర్ పదవులకు నామినేషన్ దాఖలు చేశారు.

ఇవాళ (ఆదివారం) ఆఖరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఫిబ్రవరి 04వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఫిబ్రవరి 09వ తేదీన ఉదయం 06.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తొలి విడత పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి..ఫలితాలను వెల్లడించనున్నారు.

నామినేషన్ల సమర్పణకు.. ఆదివారం చివరి రోజు కావడంతో.. 2021, జనవరి 29వ తేదీ శుక్రవారం తొలి రోజు నుంచే నామినేషన్లు ఊపందుకున్నాయి. నామినేషన్ పత్రాలు తీసుకెళ్లడానికి వచ్చే వాళ్ల సంఖ్య కూడా బాగానే ఉంది. నామినేషన్ల పత్రాల పంపిణీ, స్వీకరణకు సంబంధించి.. ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్లు సమర్పించడంలో.. గ్రామాలకు చెందిన అభ్యర్థులంతా బిజీగా ఉన్నారు. ఒక్క విజయనగరం జిల్లాలో తప్ప.. మిగతా అన్ని జిల్లాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు.

రాష్ట్ర వ్యాప్తంగా 175 మండలాల్లోని దాదాపు 4 వేల గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు.
జనవరి 31తో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తి.
ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన.
ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలన.

ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం.
ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణ.
ఫిబ్రవరి 9న ఉదయం 06.30 నుంచి మధ్యాహ్నం 03.30 గంటల వరకు పోలింగ్‌.
సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
సాయంత్రం 7గంటల లోపు ఫలితాల వెల్లడి.