విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై భగ్గుమన్న ప్రజానీకం..బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై భగ్గుమన్న ప్రజానీకం..బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు

Visakhapatnam steel plant privatization : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం సర్కిల్ వద్ద ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటికరణపై వైసీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు నిన్న లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన సమాధానంతో ఉక్కు కార్మికులు-నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. స్టీల్‌ ప్లాంట్ ఎదుట రాత్రి నుంచి హై టెన్షన్ నెలకొంది. ఉదయం అడ్మినిస్ట్రేషన్ భవన్‌ను కార్మికులు ముట్టడించారు. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వచ్చిన ఫైనాన్స్‌ డైరెక్టర్‌ను అడ్డుకున్నారు.

కారు ముందు బైఠాయించి ఘెరావ్ చేయడంతో.. పోలీసు భద్రత నడుమ ఆయన వెనక్కు వెళ్లిపోయారు. కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ వ్యతిరేక నినాదాలతో మార్మోగింది. స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం ముట్టడితో ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలనా భవనం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

ఇప్పటికైనా అన్నిపార్టీలు కలిసి రావాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ, వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ విశాఖ వచ్చి ఉద్యమం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామా అస్త్రాలు సంధించాలని.. అప్పుడే కేంద్రం దిగొస్తుందన్నారు గంటా శ్రీనివాసరావు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలతో విజయవాడ మార్మోగుతోంది. లెనిన్ సెంటర్‌లో అన్ని ట్రేడ్ యూనియన్‌లు అందోళన చేపట్టాయి. కేంద్రం ఇచ్చిన జీవోలను దగ్ధం చేసి నిరసన తెలిపాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని ట్రేడ్‌ యూనియన్ నాయకులు హెచ్చరించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలుగు ప్రజల సత్తా ఎమిటో మరోసారి చూపిస్తామన్నారు.