రాష్ట్రంలోకి రాకుండా వలస కూలీలను ఆపేసిన ఏపీ పోలీసులు

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 03:13 PM IST
రాష్ట్రంలోకి రాకుండా వలస కూలీలను ఆపేసిన ఏపీ పోలీసులు

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల కష్టాలు కొనసాగుతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుంటున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు వచ్చిన వారిని గరికపాడు చెక్ పోస్టు వద్ద ఏపీ పోలీసులు ఆపేశారు. దీంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. 

ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో సరిహద్దులోని రామాపూరం వద్ద వలస కూలీలు నిలిచిపోయారు. వారిని ఏపీలోకి అనుమతించేందుకు తమకు ఆదేశాలు రాలేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. తెలంగాణ నుంచి వస్తున్న వారిలో కొందరు కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. తాము వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా తమను ఎందుకు రానివ్వడం లేదని వలస కార్మికులు పోలీసులను నిలదీస్తున్నారు. గరికపాడు చెక్ పోస్టు వద్ద వలస కూలీలు ఆందోళనకు దిగారు. 

లాక్ డౌన్ కారణంగా ఏపీకి చెందిన వలస కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు తెలంగాణలో చిక్కుపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వలస కూలీలకు వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇచ్చినటువంటి సడలింపుల నేపథ్యంలో  కొంతమంది నిన్న బయలుదేరి ఈరోజు ఆంధ్రప్రదేశ్- తెలంగాణ సరిహద్దులోని గరికపాటి చెక్ పోస్టు దగ్గరకు వచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వారందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించి, వారికి సర్టిఫికేట్స్ ఇచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. 

250 నుంచి 300 వందల మంది వలస కూలీలు గరికపాడు చెక్ పోస్టు వద్దకు వచ్చారు. తెలంగాణ, ఏపీ సరిహద్దు వద్ద వారంతా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన దృవీకరణ పత్రాలుండి, వీరందరూ క్వారంటైన్ పూర్తి చేసుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న సర్టిఫికెట్స్ ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. అయితే అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉండటం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్స్ లేని వారు కూడా వారితో కలిసి ఏపీకి పయనమైన నేపథ్యంలో వారందరినీ పోలీసులు ఆపేశారు. 

పోలీసులు గరికపాడు చెక్ పోస్టు వద్ద పెద్ద ఎత్తున్న తనిఖీలు చేస్తున్నారు. దాదాపు 250 నుంచి 300 మందికి వరకు అక్కడి చేరుకోవడం, వారిలో ఎక్కువ మందికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన సర్టిఫికేట్స్ లేకుండానే ఏపీకి పయనమయ్యారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఏపీ పోలీసులు ఖరాకండిగా చెబుతున్నారు. దీందో పోలీసులకు, వలస కూలీల మధ్య వాగ్వాదం జరిగింది. 

ఎట్టి పరిస్థితిలో వారిని అనుమతించేది లేదని, తిరిగి వెళ్లి వారి పూర్తి స్థాయిలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నుంచి సర్టిఫికేట్ తీసుకరావాలని, లేకపోతే ఏపీకి రావాలంటే 14 రోజులపాటు క్వారంటైన్ సెంటర్లకు పంపిస్తామని పోలీసులు చెప్పారు. అందుకు వారు సుముఖంగా ఉంటేనే ఏపీలోకి అనుమతిస్తామని క్లియర్ గా చెప్పిన క్రమంలో అక్కడ ఉద్రికత్త నెలకొంది.