ఇంటి వద్దకే రేషన్ : ప్రతి బియ్యం బస్తాకు సీల్, సంచికి యూనిక్ కోడ్

ఇంటి వద్దకే రేషన్ : ప్రతి బియ్యం బస్తాకు సీల్, సంచికి యూనిక్ కోడ్

ap ration home delivery : రేషన్ డోర్ డెలివరీ వాహనాలను గురువారం సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న సర్కార్. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్లో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పంపిణీ కానుంది. ఇకపై ప్రతీ నెలా.. రేషన్ లబ్దిదారుని ఇంటి వద్దకే స్వర్ణరకం బియ్యాన్ని అందించేందుకు సీఎం జగన్ రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్నారు. సంవత్సరానికి 830 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వేదికగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి 2 వేల 500 డోర్‌ డెలివరీ వాహనాలను సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. నాణ్యతపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి.. స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది.

ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధలో అనేక సమస్యలు ఎదురవుతుండటంతో పాటు.. కొంతమంది దుకాణదారులు సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోజువారీ కూలీలు రేషన్ తెచ్చుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మొబైల్ వాహనంతో రేషన్ పంపిణీ విధానాన్ని మొదలు పెడుతోంది.
వాలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖచ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేస్తారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇస్తారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్‌ ఉంటుంది. ప్రతీ సంచికీ కూడా యూనిక్‌ కోడ్‌ ఉండడం వల్ల ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ చేయబడుతుంది. మొబైల్‌ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

బియ్యం, నిత్యావసర సరుకులు కార్డు దారులకు ఇంటివద్దే అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 9వేల 260 మొబైల్‌ వాహనాలను 539 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు ఉపాధి కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందించింది. ఒక్కో వాహనం విలువ 5 లక్షల 81వేలు కాగా.. 60శాతం సబ్సిడీతో 3లక్షల 48వేల 600 రూపాయల సబ్సిడీ అందించింది. ఈ వాహనాలకు పౌర సరఫరాల శాఖ ప్రతీ నెలా అద్దె చెల్లిస్తూ ఆరు సంవత్సరాలపాటు వినియోగించుకోనుంది.