AP Corna : ఏపీలో కరోనా ఉగ్రరూపం, భారీగా పెరిగిన కొత్త కేసులు, మరణాలు.. ఆ ఒక్క జిల్లాలోనే వెయ్యికిపైగా బాధితులు

AP Corna : ఏపీలో కరోనా ఉగ్రరూపం, భారీగా పెరిగిన కొత్త కేసులు, మరణాలు.. ఆ ఒక్క జిల్లాలోనే వెయ్యికిపైగా బాధితులు

Ap Reports Record Corona Cases

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌లో 6వేలకుపైగా కేసులు నమోదడం ఇదే తొలిసారి. అలాగే మరణాల సంఖ్యా క్రమంగా పెరుగుతోంది.

6వేల 96 కేసులు..20మరణాలు:
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,962 పరీక్షలు నిర్వహించగా.. 6,096 కేసులు నిర్ధారణ కాగా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,48,231 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం(ఏప్రిల్ 16,2021) వెల్లడించింది.

చిత్తూరుపై కరోనా పంజా:
చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, కడప, కర్నూలు‌, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7వేల 373కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,194 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,05,266కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35వేల 592 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,56,06,163 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,024.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.

ఆ 5 జిల్లాల్లో 500లకు పైగా కేసులు:
ఏపీలోని ఐదు జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాపై కోవిడ్ పంజా విసిరింది. చిత్తూరు జిల్లాలో 1024 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు జిల్లాలో 735, కర్నూలు జిల్లాలో 550, శ్రీకాకుళం జిల్లాలో 534 కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత సంవత్సర కాలంలో ఎన్నడూ లేని ఉద్ధృతితో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. మనదేశంలో కరోనా కేసుల వేగం అమెరికా కంటే అధికంగా ఉంది. అగ్రరాజ్యంలో లక్ష నుంచి 2లక్షల కేసులు పెరగడానికి 34 రోజుల సమయం పడితే భారత్‌లో పది రోజులే పట్టింది.

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 14,73,210 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2లక్షల 17వేల 353 కొత్త కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917 చేరింది. నిన్న(ఏప్రిల్ 15,2021) 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,74,308 మంది కరోనాతో చనిపోయారు.

ఇక, యాక్టివ్ కేసులు 15లక్షలకు పైబడి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రేటు 10.46శాతానికి పెరిగింది. ఇక నిన్న లక్షమందికి పైగా కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 1,18,302 మంది కోలుకోగా.. మొత్తంగా కోటీ 25లక్షల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయింది. ఇంతకాలం మహారాష్ట్ర మీద పడగవిప్పిన కరోనా వైరస్ ఇప్పుడు ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌కు విస్తరిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఢిల్లీ ఇప్పటికే వారాంతపు కర్ఫ్యూ విధించింది.

corona cases