AP Capital: శరవేగంగా పాలనా రాజధాని ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా మారబోతున్న క్రమంలో విశాఖపట్నం అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నంలో పడింది ప్రభుత్వం. సీఎం విశాఖ నుంచే అతి త్వరలో పరిపాలనా సాగిస్తారని వైసీపీ స్పష్టం చేయడంతో...

AP Capital: శరవేగంగా పాలనా రాజధాని ఏర్పాట్లు

Ap Capital

AP Capital: ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా మారబోతున్న క్రమంలో విశాఖపట్నం అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నంలో పడింది ప్రభుత్వం. సీఎం విశాఖ నుంచే అతి త్వరలో పరిపాలనా సాగిస్తారని వైసీపీ స్పష్టం చేయడంతో… విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

విద్యకు ఆంధ్రా యూనివర్సిటీ, ఉపాధికి అనేక పరిశ్రమలు.. రవాణాకు జల, వాయు, రోడ్డు, రైలు మార్గాలు ఇలా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది విశాఖపట్నం. ఇప్పటికే స్లమ్ ఫ్రీ సిటీగా మార్చడంతో పాటుగా పూర్తి స్థాయిలో అధునాతన సదుపాయాలు, టూరిజం అభివృద్ధి వంటి వాటికి అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఒకప్పుడు చిన్న మత్య్సకార గ్రామాల సమాఖ్యగా ఉన్న వైజాగ్.. ప్రస్తుతం భీమిలి నుంచి అనకాపల్లి వరకూ, పెందుర్తి నుంచి పరవాడ వరకూ విస్తరించింది. దీంతో 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళికలను వేస్తున్నారు అధికారులు.

రోడ్డు, నివాస సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా పార్కుల అభివృద్ధితో పాటుగా జీవీఎంసీ పరిధిలో ఉన్న వాటర్ బాడీలు, డ్రైనేజీ వ్యవస్థలకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, మురుగు నీరు సముద్రంలోకి వెళ్లకుండా రీ సైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో సీఎం శంకుస్థాపన చేశారు. వీటిని త్వరగా పూర్తి చేయడంతో పాటుగా కొత్తగా కైలాసగిరి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకూ ఆరు లేన్ల రోడ్లు నిర్మాణం చేశారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సర్లోవా పార్కును జాతీయ స్థాయిలో బృందావన్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్‌గా రూపొందించాలని నిర్ణయించారు. ఇప్పటికే దీని అభివృద్ధికి స్పెషల్ గ్రాంట్ క్రింద సీఎంని వంద కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

జీవీఎంసీ ఆధ్వర్యంలో పనులు నిరంతరం జరిగేలా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. 15 రోజులకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇంతకాలం కేవలం బీచ్ రోడ్డుకే పరిమితమైన అభివృద్ధి ఇప్పుడు నగరమంతా జరుగుతోంది. విశాఖ పరిపాలనా రాజధానిగా మారేలోగా అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేస్తోంది రాష్ర్ట ప్రభుత్వం.