ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం

ఈ నెల(మార్చి) 31తో తన పదవీ కాలం ముగుస్తుందని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం

Sec Nimmagadda Ramesh Kumar

Mptc, Zptc Elections : రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యమన్నారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ నెల(మార్చి) 31తో తన పదవీ కాలం ముగుస్తుందని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దీని వల్ల ఎన్నికల నిర్వహణ అసాధ్యం అన్నారు నిమ్మగడ్డ.

తన పదవీ కాలం పూర్తవుతుండటంతో ఎన్నికలను నిర్వహించలేనని నిమ్మగడ్డ తేల్చి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను షెడ్యూల్ విడుదల చేయలేను అని స్పష్టం చేశారు. తన తదుపరి వచ్చేవారు ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. హైకోర్టు తీర్పు, ఎన్నికల కోడ్ కారణంగా నిర్వహించలేమన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామన్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చని.. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని నిమ్మగడ్డ చెప్పారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామన్నారు.

నిమ్మగడ్డ ప్రకటనతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడే అవకాశం లేదని తెలుస్తోంది. హైకోర్టులో కూడా ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు వెంటనే జరపాలని ఎస్ఈసీకి తాము ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోలేమని.. ఎప్పుడు నిర్వహించాలనేది ఎస్ఈసీ నిర్ణయమని అభిప్రాయపడింది.

వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని జగన్ ప్రభుత్వం భావించింది. పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు కూడా అయిపోతే వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చని ప్రభుత్వం అనుకుంది. పైగా పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు జరిగితే వైసీపీకి ప్లస్ అవుతుందని లెక్కలు వేసింది.