బలవంతపు ‘ఏకగ్రీవాలు’ వద్దు

బలవంతపు ‘ఏకగ్రీవాలు’ వద్దు

AP SEC Nimmagadda responds over the unanimous elections : ఏపీలో ఏకగ్రీవ ఎన్నికలపై రగడ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య వివాదం ముదురుతోంది. ఏకగ్రీవ ఎలక్షన్ పై ఎన్నికల కమిషన్ కు నిశ్చయమైన అభిప్రాయం ఉందన్నారు నిమ్మగడ్డ. బలవంతపు ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. అన్ని ఏకగ్రీవ ఎన్నికలు తప్పని అనటం లేదన్నారు. కొన్ని గ్రామాల్లో కొన్ని సందర్భాల్లో, పెద్దలు, వారికున్న నాయకత్వ నేపథ్యంలో ఏకగ్రీవాలకు సామరస్యత, అనుకూలత ఉంటుందని చెప్పారు. అలాంటి ఏకగ్రీవాలను ఎన్నికల కమిషన్ వ్యతిరేకించదని స్పష్టం చేశారు.

కానీ అసాధారణంగా ఏకగ్రీవాల పేరుతో గతంలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు జరిగిన మూసలో జరిగినట్లైతే అది సమర్థనీయత, వాంఛనీయం, న్యాయ సమ్మతం కాదన్నారు. అది నైతికంగా కూడా కరెక్టు కాదన్నారు. అలాంటి ఏకగ్రీవాలను ఎవరు కూడా కోరుకోవద్దని తెలిపారు. ఏకగ్రీవాలకు వచ్చిన అడ్వర్టైజ్ మెంట్స్ ను నిలుపుదల చేయాలని ఐఆండ్ పీఆర్ కమిషనర్ సంజాయిషీ ఇచ్చారని తెలిపారు.

ఏకగ్రీవాలను సమర్థిస్తానని..కానీ ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏకగ్రీవాలను ప్రభావితం చేసే, ప్రోత్సహించే వారందరిపై ఈరోజు నుంచి షాడో టీమ్స్ పెడుతున్నట్లు, వారిని కెమెరా టీమ్స్ ఫాలో అవుతాయని తెలిపారు. మళ్లీ వారు గ్రామాల్లోకి వెళ్లి ఏకగ్రీవాలని మీటింగ్స్, ప్రచారం, ఆర్భాటం చేస్తే వారిని గ్రౌండింగ్ చేసి, ఇంటికే పరిమితం చేస్తామని చెప్పారు.

ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతాయని తెలిపారు. తాను రాజ్యాంగబద్ధంగానే వ్యవరిస్తున్నానని, విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రకటించారు. తాను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదని వాపోయారు. నిజాయితీగా తన అభిప్రాయాలను చెబుతానని పేర్కొన్నారు. తనపై విమర్శలు చేయవద్దని కోరారు.