ఏపీలో కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదు

  • Published By: chvmurthy ,Published On : April 23, 2020 / 01:20 PM IST
ఏపీలో కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గురువారం కొత్తగా 80  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్పారు. దీంతో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893 కు చేరింది. పాజిటివ్  కేసుల సంఖ్య విషయంలో వైద్య ఆరోగ్య శాఖ  చాలా పారదర్శకతతో ఉందని…. తమ శాఖ ఇచ్చే నివేదికనే మీడియా సంస్ధలు ప్రకటించాలని ఆయన కోరారు. 

కర్నూలు జిల్లాలో గురువారం ఒక్కరోజే 31 కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. తాజాగా  కర్నూలు జిల్లాలో నమోదైన కేసులతో జిల్లా వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 234కు చేరగా.. ఈరోజు ఇద్దరు వ్యక్తులు  మరణించారు. దీంతో కర్నూలు జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అవగా 223 మంది జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా 9 ల్యాబ్ లు పనిచేస్తున్నాయని పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. ఫిబ్రవరి 15న తిరుపతిలో రోజుకు 90 పరీక్షల సామర్థ్యం ఉండగా.. మార్చి 15 నాటికి ఆ సంఖ్యను 450కి పెంచామన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 మంది మృతిచెందినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం 4 కొవిడ్  ఆస్పత్రులు ఉన్నాయని.. కర్నూలు ఆస్పత్రిని కూడా కొవిడ్ ఆస్పత్రిగా మార్చామని జవహర్ రెడ్డి వివరించారు.  

ఏపీలో మొత్తం 573 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని ఆయన తెలిపారు.  47 మండలాలు ఆరెంజ్  జోన్ లో ఉన్నాయని చెప్పారు.  కొన్నికేసులలో 14 రోజుల తర్వాత కరోనా పాజిటివ్  వస్తోందని ఆయన వివరించారు. రాష్ట్రంలోని 893 కరోనా కేసుల్లో అత్యధికంగా నాలుగు జిల్లాల్లోనే నమోదయ్యాయని  ఆయన వివరించారు. నమోదైన వాటిలో 590 కేసులు 4 జిల్లాల్లోనే ఉన్నట్లు చెప్పారు. 

రాష్ట్రంలో  సరిగా కరోనా పరీక్షలు నిర్వహించడం లేదనే విమర్శలు సరికాదని జవహర్ రెడ్డి చెప్పారు. దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేసే రాష్ట్రంగా ఏపీ నిలిచిందని.. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయద్దని ఆయన హితవు పలికారు.