ఏపీ ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా విడుదల

  • Published By: bheemraj ,Published On : November 17, 2020 / 08:56 AM IST
ఏపీ ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా విడుదల

Voters Special Draft List : ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా-2021ని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 15న ప్రచురించే తుది ఓటర్ల జాబితాను సంసిద్ధతగా ఈ ముసాయిదా వెలువడింది. ఈ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సవరణలు పంపించాల్సిందిగా ఎన్నికల సంఘం ప్రజలను కోరింది.



డిసెంబర్ 15 వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. 2021 జనవరి 15న తుది జాబితా సిద్ధమవుతుందని వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల లక్షా 45 వేల 674 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.



ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు
నిండేవారిని ఓటర్ గా నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ల జాబితాలో పేరులేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. డిసెంబర్ 15 వరకు ఓటర్ గా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.



నవంబర్ 28, 29 తేదీల్లో, డిసెంబర్ 12, 13 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వారిగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు.
https://10tv.in/cbi-case-on-indecent-posts-against-ap-high-court-judges-on-social-media/
ఓటర్లుగా చేరేందుకు, ఏదైనా మార్పులు, చేర్పులున్నా బూత్ స్థాయి ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, అభ్యంతరాలను వచ్చే జనవరి 5 నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14వ తేదీన ఓటర్ల తుది జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకుని జనవరి 15న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.