అరకు యాక్సిడెంట్ బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స..ఇద్దరి పరిస్థితి విషమం

అరకు యాక్సిడెంట్ బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స..ఇద్దరి పరిస్థితి విషమం

Araku accident victims : విశాఖపట్నం డముకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అరకు బస్సు యాక్సిడెంట్ లో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లత, కృష్ణవేణికి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని మరొక ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రమాదంలో చనిపోయిన నలుగురి మృతదేహాలకు కేజీహెచ్ లో పోస్టుమార్టం చేయనున్నారు. అనంతరం మృతదేహాలను హైదరాబాద్ కు తరలిస్తారు.

ఘాట్ రోడ్డులో బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోతులో పడింది. 5వ హెయిర్ పిన్ బెండ్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 5వ మలుపు దగ్గర గతంలోనూ ప్రమాదాలు జరిగాయని..కానీ ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు అంటున్నారు. నిన్న జరిగిన ప్రమాదమే అతిపెద్దదని చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బస్సు లోయలోకి పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌లోని షేక్‌ పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 25 మంది ఈ నెల 10వ తేదీన దినేష్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో బయలుదేరారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. నిన్న ఉదయం అరకు అందాల్ని ఆస్వాదించారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి సింహాచలం బయలుదేరారు.

రాత్రి 7 గంటల సమయంలో అనంతగిరి మండలం డముకు-టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. ఒక్కసారిగా 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిపోయింది. చిమ్మచీకటి కావడంతో.. ఏం జరుగుతుందో ఊహించేలోగా విషాదం అలముకుంది. లోయలోంచి హాహాకారాలు వినిపించడంతో.. వెనుక వస్తున్న పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. వెంటనే బొర్రా గుహల్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి చేరుకుకొని పోలీసులు, ప్రయాణికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

పూర్తిగా చీకటిగా ఉండటంతో బస్సులోంచి క్షతగాత్రుల్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే.. నలుగురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన వారందరినీ హుటాహుటిన ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.