డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం..బ్రేక్ ఫెయిలయిందని తెలిసినా పట్టించుకోలేదు : బాధితులు

డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం..బ్రేక్ ఫెయిలయిందని తెలిసినా పట్టించుకోలేదు :  బాధితులు

bus accident విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో.. అనంతగిరి మండలం డముకులో 5వ నంబర్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో దాదాపు 30మంది ప్రయాణికులతో వెళ్తోన్న దినేష్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. సుమారు 300 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మంది మృతి చెందగా.. 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో 3 నెలల చిన్నారి కూడా ఉంది. ఇక, 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు బృందాలు,108సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

బుధవారం(ఫిబ్రవరి-10,2021) హైదరాబాద్ నుంచి దినేష్ ట్రావెల్స్ బస్సులో అమరావతికి వెళ్లి..విజయవాడ,పాలకొల్లు,అన్నవరంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని శుక్రవారం ఉదయానికి అరకు చేరుకున్నట్లు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5:30గంటలకు అరకు నుంచి సింహాచలం వెళ్లేందుకు బయల్దేరినట్లు తెలిపారు. అయితే,బస్సు బ్రేక్ ఫెయిల్ అయిందని తెలిసి..తాము బస్సు ఆపమని వారించినా..తమ మాటలను డ్రైవర్ పట్టించుకోలేదన్నారు.

తమ మాటలను పట్టించుకోకుండా.. ఆలస్యమవుతుంది అంటూ బస్సును ముందుకు పోనిచ్చాడని తెలిపారు. దీంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు.డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. అరకు రూట్ పై డ్రైవర్ కు ఎలాంటి అవగాహన లేదని ప్రయాణికులు తెలిపారు. ఘాట్ రోడ్డులో నడపడం రాదని డ్రైవర్ తమకు ముందే చెప్పలేదన్నారు. అమరావతి నుంచి వచ్చేటప్పుడే తమను డ్రైవర్ చాలా ఇబ్బంది పెట్టాడని ఓ బాధితురాలు తెలిపారు.

ఇక,క్షతగాత్రులను ఎస్.కోట హాస్పిటల్ కు తరలించినట్లు అనంతగిరి ఎస్సై సుధాకర్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కి కాలు విరగడంతో అతనిని కూడా హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం తరలించినట్లు తెలిపారు. కాగా, బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇక, ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.