అమరావతిలో బొత్సకు ఏం పని? జగన్ సీక్రెట్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? 

  • Published By: srihari ,Published On : June 23, 2020 / 10:58 AM IST
అమరావతిలో బొత్సకు ఏం పని? జగన్ సీక్రెట్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? 

అమరావతి గురించి జగన్ మదిలో ఏం ఆలోచనుంది? ఎవరికీ తెలియదు. చాలా రహస్యం. సరిగ్గా ఈ సమయంలోనే బొత్సా రాజధాని ప్రాంతంలో హడావిడిగా తిరుగుతుండంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అమరావతిని జగన్‌ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది అనే సందేహం వ్యక్తమవుతోంది. మూడు రాజధానుల విషయంలో తగ్గేదే లేదంటున్న సర్కార్‌.. ఇప్పుడు అమరావతిపై ఎందుకు దృష్టిపెడుతోంది.

రాజధాని మార్పు అంశాన్ని తెరమీదకు తెచ్చిన మంత్రి బొత్సా.. ఇప్పుడు అదే అమరావతిలో ఆగిన నిర్మాణాలను ఎందుకు పరిశీలిస్తున్నారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి.. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో రెండవసారి CRDA రద్దు, మూడు రాజధానుల కోసం రూపొందించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను చట్టం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. టీడీపీ ఎమ్మెల్సీలతో మంత్రులు బాహాబాహీకి దిగారు. బిల్లుపై సభలో రణరంగం… శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. రెండోసారి ఈ బిల్లులు చట్టం కాకుండా ఆగిపోయాయి. 

ఈ బిల్లులపై హైకోర్టులో వేసిన పిటిషన్‌లపై విచారణ జరుగుతోంది. రాజధాని కోసం భూములిచ్చిన  రైతులు ఆందోళనలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఆందోళనలకు కాస్త విరామం తప్పలేదు. ఇంత జరిగినా రెండు సార్లు ఈ  బిల్లులను చట్టం చేసేందుకు ప్రయత్నించిన జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో తాము వెనక్కి తగ్గడం లేదని  స్పష్టం చేసినట్లయింది. గవర్నర్ ప్రసంగంలో కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. రాజధాని మార్పు ప్రస్తావన తెచ్చి, ప్రభుత్వ  ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పింది. మంత్రి బొత్సానే. ఆయనే రాజధాని ప్రాంతంలో రెండు రోజుల పాటు పర్యటించడం, ఇంతవరకు జరిగిన పనులను పరిశీలించడంతో ప్రభుత్వ అమరావతిని ఏ రూపంలో అభివృద్ధి చేయాలనుకుంటుందోనన్న చర్చ మొదలైంది. 

బొత్స సత్యనారాయణ రాజధాని నిర్మాణాలను పరిశీలించి అధికారులతో వాటి వివరాలపై సమాచారం తెలుసుకోవడం, తాను మరో మారు పర్యటిస్తానని చెప్పారు. చంద్రబాబు పాలనలో రాజధాని ప్రాంతంలో అక్రమాలు జరిగాయని వాటిని నిగ్గు తేల్చాలని వేసిన గ్రూప్‌ ఆఫ్ మినిస్టర్స్‌లో బొత్స ఒకరు ఉన్నారు. అలాంటి బొత్స రాజధాని నిర్మాణాలను అన్నింటిని స్వయంగా పరిశీలించడాన్ని బట్టి చూస్తే.. మూడు రాజధానులపై  అమరావతి ప్రాంత ప్రజలను ఒప్పించే కార్యక్రమం ఏదో చేపట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిర్మాణాలను ఎలా ఉపయోగిస్తారు అన్నది పెద్ద ప్రశ్న అందరిలో వినిపిస్తోంది.