యాంకర్ పోస్టు ఇప్పిస్తానని రూ.25లక్షలు కొట్టేసిన మాయగాడు

యాంకర్ పోస్టు ఇప్పిస్తానని రూ.25లక్షలు కొట్టేసిన మాయగాడు

astrologer atchireddy collect Rs.25 lakhs for anchor post : ఇంట్లో వాస్తుదోషాలు ఉన్నాయి వాటిని పోగోట్టటానికి నాలుగున్నర లక్షలు ఖర్చవుతుందని డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో విజయవాడకు చెందిన సిధ్దాంతి కే. అచ్చిరెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు అచ్చిరెడ్డి చేస్తున్న మోసాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి.

వెండితెరపై కానీ, బుల్లితెరపై కానీ ఒక వెలుగు వెలిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు  కలలు  కనే ఉంటాురు.  అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తారు.  బుల్లి తెరపై యాంకర్ గా అవకాశం ఇప్పిస్తానని ఒక యువతినుంచి  అచ్చిరెడ్డి  రూ. 25లక్షలు, కొట్టేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.

విజయవాడ భవానీపురంలో సాయిత్రి శక్తి జ్యోతిష్యనిలయం పేరుతో జాతకాలు చెప్పే కోనాల అచ్చిరెడ్డి అనే సిధ్దాంతి నల్గోండలోని హనుమాన్ నగర్ లో సామినేని సాయి ఇంటికి వెళ్లి జ్యోతిష్యం చెప్పాడు. ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని వాటిని పోగోట్టాలంటే ఇంట్లో శాంతి పూజలు చేయాలని చెప్పి అతని వద్దనుంచి నాలుగున్నర లక్షలు వసూలు చేశాడు.

డబ్బులిచ్చిన   తర్వాత అచ్చిరెడ్డి పూజలు ఏమీ చేయకపోవటంతో బాధితుడు నల్గోండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయవాడ వచ్చి అచ్చిరెడ్డి ని అరెస్ట్ చేసి  నల్గోండ తరలించారు. అచ్చిరెడ్డిపై నల్గోండ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో 12 క్రిమినల్  కేసులు నమోదయ్యాయి.

విజయవాడలోని ఒక మహిళకు టీవీలో యాంకరింగ్ చేయటం పట్ల ఆసక్తి ఎక్కువ. దీంతో ఆ మహిళకు యాంకర్ గాఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెవద్ద రూ. 25లక్షలు వసూలు చేసాడు. ఉద్యోగం ఇప్పించలేదు ఎంటని అడిగినందుకు యువతిని దుర్భాషలాడాడు. దీంతో బాధితురాలు విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఖమ్మం పట్టణానికి చెందిన మరో మహిళకు రైల్వే లో అసిస్టెంట్ ఇంజనీరు ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఆమె వద్దనుంచి రూ.25లక్షలు వసూలుచేశాడు. గతేడాది మార్చిలో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మహిళకు సాఫ్ట్ వేర్ కంపెనీలో భాగస్వామ్యం ఇస్తామని అచ్చిరెడ్డి, అతని కుమారుడు, నగరంలో వైసీపీ ప్రముఖ నాయకుడు వంశీకృష్ణారెడ్డి మహిళ వద్దనుంచి రూ.50 లక్షలునగదు, ఒక కారు తీసుకుని మోసం చేశారు.

బాధిత మహిళ గట్టిగా నిలదీసే సరికి ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలు తమ వద్ద ఉన్నాయని వాటినిసోషల్ మీడియలో పోస్ట్ చేస్తామని బెదిరించటంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పైగా తన వద్ద ఖాళీ ప్రాంసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆ మహిళ ఖమ్మం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఇవి అచ్చిరెడ్డిచేసిన మోసాల్లో కొన్ని మాత్రమే. బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదుచేసినవి మాత్రమే.

ఇవికాక అచ్చిరెడ్డి బాధితులు ఎంతమంది ఉన్నారో దేవుడికే తెలియాలి. అమాయకుల బలహీనతలను క్యాష్ చేసుకోవటంలో అచ్చి రెడ్డి, అతని కొడుకు వైసీపీ నాయకుడు వంశీకృష్ణా రెడ్డిలు ఆరితేరారని తెలుస్తోంది. వీరికి ఏపీలోని ఒక మంత్రి అండదండలున్నాయని బాధితులు చెప్పుకుంటున్నారు.

రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞ వంటి బిరుదులు తగిలించుకుని 10వేళ్లకు 10 ఉంగరాలు  పెట్టుకుని అచ్చిరెడ్డి దొరికిన కాడికి జనాల్ని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ పోతున్నాడు. అచ్చిరెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. కేసుదర్యాప్తులో ఉంది.