TDP: అందుకే చంద్రబాబు అద్దె ఇంటిని అటాచ్‌ చేశారు: అచ్చెన్నాయుడు, బొండా ఉమా

చంద్రబాబు నాయుడి అద్దె ఇంటిని అటాచ్‌ చేయడంపై టీడీపీ నేతలు స్పందించారు.

TDP: అందుకే చంద్రబాబు అద్దె ఇంటిని అటాచ్‌ చేశారు: అచ్చెన్నాయుడు, బొండా ఉమా

Kinjarapu Atchannaidu

TDP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అద్దె ఇంటిని అటాచ్‌ చేయడం వైసీపీ సైకో చర్యలకు నిదర్శనమంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్డుకు మార్పు చేసి… అక్రమాలకు పాల్పడ్డారంటూ జగన్ (Jagan) ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

“ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం చెందింది. వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకం. ఉండవల్లి నివాసం ప్రభుత్వ భూమిలో ఉందని ఒకసారి, అక్రమకట్టడమని మరోసారి.. ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటోంది. ఏసీబీని, సీఐడీని ఉసిగొల్పుతూ.. కేసులు బనాయిస్తుంది. ప్రజా ప్రయోజనాలు నెరవేర్చడంపై చూపడం లేదు. సైకో పాలనకు, నిరంకుశ ధోరణికి ఘోరీ కట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి” అని చెప్పారు.

అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయం.. అందుకే

లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో చంద్రబాబు, నారాయణ ముద్దాయిలా? అంటూ బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) మండిపడ్డారు. లింగమనేని పేరు మీద ఇల్లు ఉంటే.. చంద్రబాబుపై క్విడ్ ప్రోకో ఆరోపణలా? అని నిలదీశారు.

“జగన్ జారీ చేసిన అటాచ్మెంట్లు.. జీవోలు.. నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావు. స్వాతంత్ర్యానికి ముందున్న చట్టాలతో కేసులు పెడతారా? జీవో నంబర్-1 కూడా బ్రిటీష్ కాలం నాటి చట్ట ప్రకారమే తెచ్చారు. కోర్టులో కొట్టేసిన అంశాలతో మళ్లీ కొత్త చట్టాలతో తప్పుడు కేసులు పెడుతున్నారు. లేని మరకలను చంద్రబాబుకు అంటించే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే.

చిన్న తప్పు జరిగితేనో, దొరికితేనో జగన్ నాలుగున్నరేళ్లు ఆగుతారా? చంద్రబాబు ఏ తప్పు చేయలేదు కాబట్టే.. జైలుకు వెళ్లలేదు. తండ్రి సీఎంగా ఉంటే అవినీతి చేసి జైలుకెళ్లింది జగనే. తన అక్రమాలు.. హత్యలు బయటకు వస్తున్నాయనే అక్కసుతో ఈ తప్పుడు కేసులు. ఈ తప్పుడు కేసులు పెట్టడానికి నాలుగేన్నరేళ్లు పట్టిందా?

జగన్ పరిపాలన ప్రజా వేదిక విధ్వంసంతో మొదలైంది. అమరావతిని నాశనం చేశారు. చట్టాలను.. వ్యవస్థలను తన రాజకీయ కక్ష సాధింపు కోసం జగన్ దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో అవినీతిని వెలికి తీస్తే సన్మానాలు చేస్తామని జగన్ అధికారులకు చెప్పారు. నిరంతర శోధన తర్వాత కూడా చంద్రబాబు ఏ తప్పు జరగలేదని తేలింది.

అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయం.. సీబీఐ తాడేపల్లి గుమ్మంలోకి రావడం ఖాయం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై తప్పుడు కేసులను తిరగదోడుతున్నారు. తనకున్న జైళ్లు.. ఛార్జ్ షీట్ల మరకలను చంద్రబాబుకు చుట్టే ప్రయత్నం చేశారు. గతంలోనే ఇన్ సైడ్ ట్రేడింగ్ జరింగిందని ఆరోపణలు చేశారు. కోర్టులు కొట్టేశాయి.

లేని రింగ్ రోడ్డులో అవకతవతలు జరిగాయని ఆరోపణలు చేశారు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇంటిని అటాచ్ చేశారు. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఉందా? జగవ్ 18 నెలలు జైల్లో ఉన్నారు.. చిప్పకూడు తిన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే జగన్ సింగిల్ డిజిట్ కూడా రాదు. ఇంటికెళ్లే ముందు తప్పుడు కేసులు పెట్టడం వెనుకున్న మర్మమేమిటీ? తప్పుడు కేసుల నుంచి న్యాయ వ్యవస్థే రక్షణ కల్పిస్తోంది” అని బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.

Buddha Venkanna : వివేకా హత్య కేసు నుంచి జగన్, అవినాష్ రెడ్డి బయటపడడం అసాధ్యం : బుద్దా వెంకన్న