నేనే హోంమంత్రిని, మిమ్మల్ని వదలను.. పోలీసులకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

నేనే హోంమంత్రిని, మిమ్మల్ని వదలను.. పోలీసులకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

atchannaidu strong warning for police: ”రేపు అధికారంలోకి వచ్చేది మేమే. చంద్రబాబుని అడిగి నేనే హోంమంత్రి పదవి తీసుకుంటా. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు ఎక్కడున్నా విడిచిపెట్టను..” ఇదీ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు.. పోలీసులకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారనే ఆరోపణల కేసులో పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భారీ బందోబస్తు నడుమ పోలీసులు ఈ ఉదయం అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, పోలీసుల తీరుపై అచ్చెన్న ఫైర్ అయ్యారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తలకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. తన ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అచ్చెన్న ప్రశ్నించారు. రేపు కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అన్న అచ్చెన్న, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

”చాలెంజ్ చేస్తున్నా. తగిన మూల్యం చెల్లిస్తారు. నేను రాజకీయ నాయకులను తప్పు పట్టను. పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారు. డీఎస్పీ, సీఐ.. వైసీపీ కార్యకర్తలకన్నా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేను మళ్లీ మళ్లీ చాలెంజ్ చేస్తున్నా. రేపు అధికారంలోకి మేమే వస్తాం. చంద్రబాబుకి చెప్పి హోంమినిస్టర్ పదవి నేనే తీసుకుంటా. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు ఎక్కడున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయాన్ని, ధర్మాన్ని నమ్మే వ్యక్తిని. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. తెల్లవారుజామున బెడ్ రూమ్ లో ఉంటే డీఎస్పీ, సీఐ నా బెడ్ రూమ్ కి వస్తారా? నా మీద కేసు ఉంటే, నాకు నోటీసు ఇస్తే నేనే పోలీస్ స్టేషన్ కి వచ్చేవాడిని. చట్టానికి అతీతంగా వ్యవహరించే వ్యక్తిని కాను. ఇటువంటి దారుణాలు చేస్తున్నారు. అసలు ఖాకీ డ్రెస్ అంటే అసహ్యం వేస్తోంది. రాష్ట్రంలో ఖాకీ డ్రెస్ వేసుకున్న ఇతర పోలీసులు సిగ్గు పడుతున్నారు. ”-అచ్చెన్నాయుడు.