ఎవరూ అడక్కపోయినా రాజీనామా చేశారు…. ఏకంగా లోకేష్‌నే ఇరికించేశారు….

ఎవరూ అడక్కపోయినా రాజీనామా చేశారు…. ఏకంగా లోకేష్‌నే ఇరికించేశారు….

టీడీపీ నేత, ఎమ్ఎల్సీ బీటెక్ రవి వ్యవహార శైలిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మూడు రాజధానులు వ్యవహారంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. శాసనమండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాక ఏ విధంగా గవర్నర్ బిల్లులను ఆమోదిస్తారు? సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారని ఆయన అంటున్నారు.

బిల్లులను చట్టం చేయడం శాసనమండలి సభ్యులు మొత్తాన్ని అవమానపరచడమేనని పేర్కొన్నారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయనప్పుడు తాము శాసనమండలి సభ్యులుగా ఉండటం దేనికంటూ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. బీటెక్‌ రవి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులు మొత్తం రాజీనామా చేసి, రాజధాని రైతులకు బాసటగా నిలవాలని తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేశారు రవి. తాను రాయలసీమకు చెందిన వ్యక్తి అయినా అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తానని అంటున్నారు.

రైతుల సమక్షంలోనే తన రాజీనామాని చేస్తున్నానని, ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. రాజధాని రైతుల ముందే రాజీనామా పత్రంపై సంతకం చేసిన బీటెక్ రవి ఇంకా ఆ పత్రాలను శాసనమండలి చైర్మన్‌కు సమర్పించలేదు. సడన్‌గా రవి రాజీనామా చేయాలనుకోవడంపై చర్చ జరుగుతోంది. బీటెక్ రవి అంత సీరియస్ పొలిటీషయన్ ఏమీ కాదు. 2011లో వైసీపీ స్థాపించినప్పుడు పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్‌ తల్లి విజయలక్ష్మి పై పోటీ చేయడానికి అప్పుడు అక్కడ ఉన్న సతీష్ రెడ్డి ముందుకు రాకపోవడంతో బీటెక్ రవిని టీడీపీ రంగంలోకి దించింది. ఆ తర్వాత బీటెక్ రవి కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి పోటీ చేయడానికి రేసులోకి వచ్చారు.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అనుచరుడిగా పేరుపడ్డారు. బీటెక్ రవికి ఎమ్మెల్సీ స్థానం ఇస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబుతో చెప్పి ఒప్పించారు రమేశ్‌. ఆ ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ లేకపోయినా వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు పొందారు బీటెక్ రవి. ఎప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఎందుకో ఉన్నట్టుండి ఒకేసారి రాజీనామా చేసి అమరావతి ఉద్యమంలో ముందు నిలబడతా అంటున్నారన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. సొంత పార్టీ నేతలు సైతం బీటెక్‌కి ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు అని చర్చించుకుంటున్నారు. దీనిపై పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడో కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అమరావతి కోసం రాజీనామా చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న వారిని కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ వస్తుంది కదా అని చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి చెందిన మంగళగిరి నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న లోకేశ్‌ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రాజీనామా ఆమోదం పొందితే లోకేశ్‌ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీలు టి.డి.జనార్దన్, బుద్ధా వెంకన్న, బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చే అవకాశముందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

బీటెక్ రవి ఆలోచించే రాజీనామాకు సిద్ధపడ్డారా? లేకపోతే వేరే ఏమైనా ఉందా? అనేది అర్థం కాక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ పార్టీ అధినేతతో ఏమైనా చర్చించారా? లేదా? అనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. రవి ఎవరి కోసమైతే రాజీనామా చేశానని చెబుతున్నారో ఆ అమరావతి రైతులు మాత్రం రాజీనామాలు కోరటం లేదు. పదవిలో ఉండే పోరాటం చేయాలంటున్నారు. ప్రజల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు రాజీనామా అంశం తెర మీదకు తీసుకొస్తారు రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయ్యారు. ఈనాడు అమరావతి రైతుల ఉద్యమంలో ఆ స్థాయి భావోద్వేగాలు లేవనే చెప్పాలి. మరి అలాంటప్పుడు బీటెక్ రవి రాజీనామా అస్త్రాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు? దీనివెనక అజెండా ఏమైనా ఉందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

టీడీపీలోని రవి ప్రత్యర్థులు మాత్రం దీనిపై రకరకాల భాష్యాలు చెబుతున్నారు. ఇదంతా వేరే పార్టీ అజెండాలో భాగమేనని అంటున్నారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో చేరడానికి బీటెక్ ప్రయత్నించారని, కనీసం మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సొంత మండలానికి కూడా జడ్పీటీసీ స్దానానికి నామినేషన్ వేయించలేకపోయారని బీటెక్ రవిని విమర్శిస్తున్నారు. ఇది కచ్చితంగా సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా కుట్ర కోణంలోజరుగుతోందని కూడా చెబుతున్నారు. దీని వెనక ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ హ్యాండ్ కూడా ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.