ఎట్టకేలకు బాబు వస్తున్నాడు : రేపు రాజధాని గ్రామాల్లో బాలకృష్ణ పర్యటన

రాజధాని రణరంగం అవుతుంటే.. నందమూరి వారసుడు ఎక్కడ? చంద్రబాబు, లోకేష్‌లు ఆందోళనలతో దూసుకెళ్తుంటే, టీడీపీ వ్యవస్థాపకుడి కుమారుడు ఎక్కడ? పార్టీలో అత్యంత

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 01:13 PM IST
ఎట్టకేలకు బాబు వస్తున్నాడు : రేపు రాజధాని గ్రామాల్లో బాలకృష్ణ పర్యటన

రాజధాని రణరంగం అవుతుంటే.. నందమూరి వారసుడు ఎక్కడ? చంద్రబాబు, లోకేష్‌లు ఆందోళనలతో దూసుకెళ్తుంటే, టీడీపీ వ్యవస్థాపకుడి కుమారుడు ఎక్కడ? పార్టీలో అత్యంత

రాజధాని రణరంగం అవుతుంటే.. నందమూరి వారసుడు ఎక్కడ? చంద్రబాబు, లోకేష్‌లు ఆందోళనలతో దూసుకెళ్తుంటే, టీడీపీ వ్యవస్థాపకుడి కుమారుడు ఎక్కడ? పార్టీలో అత్యంత కీలకమైన నందమూరి బాలకృష్ణ, ఇంతవరకు మూడు రాజధానుల ప్రతిపాదనలపై నోరు విప్పలేదు ఎందుకు? కావాలనే సైలెంట్ అయ్యారా? ఎందుకైనా మంచిదని సైడయ్యారా? తొడగొట్టి మీసం మెలేసే సమరసింహారెడ్డిలో ఈ బెరుకు ఎందుకు? ఇప్పటివరకు సాధారణ ప్రజల్లోనే కాదు.. టీడీపీ శ్రేణుల్లోనూ ఎన్నో సందేహాలు, ప్రశ్నలు. వీటికి బాలయ్య బాబు తెరదించనున్నారు. ఎట్టకేలకు బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నారు. రేపు(జనవరి 15,2020) రాజధాని అమరావతి గ్రామాల్లో బాలకృష్ణ పర్యటించనున్నారు.

రాజధాని ప్రాంతంలో బాలకృష్ణ పర్యటన ఆసక్తికరంగా మారింది. రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బాలకృష్ణ ఏం మాట్లాడతారు? ఏం చెబుతారు? జగన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు? రైతులకు ఎలాంటి హామీ ఇస్తారు? జై అమరావతి అంటారా? అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. 

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్‌ ఆందోళనలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా ధర్నాల్లో పాల్గొని అరెస్టులు కూడా అవుతున్నారు. జగన్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రైతులు, మహిళలకు మద్దతుగా ఊరూరా తిరుగుతున్నారు. చంద్రబాబైతే ఏకంగా జోలె పట్టి ఉద్యమ నాయకులకు విరాళాలు సేకరిస్తున్నారు. పార్టీలో పునరుత్తేజానికి రాజధాని ఉద్యమాన్ని ఒక ఆయుధంగా మలచుకోవాలనుకుని చూస్తున్నారు. ఒకవైపు పార్టీ కీలక నాయకత్వమంతా ఆందోళనల్లో పాల్గొంటూ ఉంటే.. నందమూరి వారసుడు మాత్రం, ఇప్పటివరకు ఒక్క మాటా మాట్లాడకపోవడం.. అమరావతి రైతులనే కాదు, టీడీపీ శ్రేణులనూ విస్మయానికి గురి చేసింది.

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వారసుడిగా, రాబోయే కాలంలో కాబోయే పార్టీ కీలక నాయకుడిగా కార్యకర్తలంతా బాలయ్య, బాలయ్య అంటుంటే, ఆయన మాత్రం ఒక్క మాటా మాట్లాడకపోవడం తమ్ముళ్లను బాధించింది.

అటు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సైతం మూడు రాజధానులపై తన అభిప్రాయమేంటో చెప్పారు. ఆందోళనలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మూడు రాజధానులపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించి క్లారిటీగా ఉన్నారు. కానీ అదే సినీ పరిశ్రమలో అగ్ర హీరో అయిన బాలయ్య మాత్రం, ఇంతవరకూ రాజధాని అంశంపై ఒక్క పంచ్ డైలాగూ వెయ్యలేదని రగిలిపోతున్నారు అమరావతి అభిమానులు.

సినిమా హీరోగా కాకపోయినా, టీడీపీలో కీలక నేతగానైనా బాలయ్య స్పందించి ఉండాల్సిందని, ఉద్యమానికి మరింత ఊపువచ్చేలా పాదం కదిపివుంటే బాగుండేదని సగటు తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి సినీ అభిమానులూ కోరుకుంటున్నారు. కానీ నెలన్నర రోజులుగా అమరావతి అట్టుడికిపోతున్నా, బాలయ్య మాత్రం మౌనవ్రతంలోనే ఉన్నారు. 

అయితే బాలకృష్ణ మౌనానికి కారణాలున్నాయన్నది ఆయన సన్నిహితుల మాట. మూడు రాజధానులపై ఏది మాట్లాడినా తనకు ఇబ్బందేనన్నది బాలయ్య లెక్క. అమరావతిలోనే రాజధాని వుండాలంటే, రాయలసీమలో బాలయ్యకు ఇబ్బందులు తప్పవు. హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయనకు, రాజధాని వ్యవహారం నిజంగా తలనొప్పిలా మారిందన్నది పార్టీ నేతల మాట. టీడీపీలో బాలయ్య కీలక నాయకుడైనా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది రాయలసీమ నుంచే కాబట్టి, ఇక్కడ తన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారట. అందులోనూ సీమలోనే బాలయ్యకు ఫ్యాన్స్‌ ఎక్కువ. సీమ నేపథ్యంలో వచ్చిన సమరసింహారెడ్డి వంటి చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అందుకే మూడు రాజధానుల టాపిక్‌లో తలదూర్చితే, అటు నియోజకవర్గంలోనూ, ఇటు సీమలో ఫ్యాన్స్‌పరంగానూ ఇబ్బందేనని నందమూరి హీరో లెక్కలేశారట.

ఇక ఉత్తరాంధ్రలోనూ బాలయ్య అభిమానులకు లెక్కేలేదు. పార్టీ విధానం ప్రకారం, విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తే, ఇక్కడా బాలయ్యకు ఇబ్బందే. రాజకీయంగా, సినిమాలపరంగా చిక్కులు తప్పవు. అంతేకాదు, తన చిన్నల్లుడు భరత్‌ విశాఖ నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తాను అమరావతిని సమర్థిస్తూ, విశాఖను వద్దంటే చిన్నల్లుడికీ పొలిటికల్‌గా నెగెటివ్‌ సిచ్యువేషన్‌ ఫేస్‌ చెయ్యాల్సి వస్తుందని… అందుకే అటు రాయలసీమ, ఉత్తరాంధ్రను హర్ట్‌ చెయ్యకుండా, మౌనమే మేలని బాలకృష్ణ అనుకున్నారని టాక్.

ఇలా అనేక అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు, విశ్లేషణలు. మొత్తానికి వీటన్నింటికి తెరదించబోతున్నారు బాలయ్య బాబు. రేపు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న బాలకృష్ణ.. ఏమి మాట్లాడతారో చూడాలి.

 

Also Read : మీరెవరూ ఇక్కడ ఉండరు.. పవన్ వార్నింగ్ : జగన్ వస్తే ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని అప్పుడే చెప్పా