జాగ్రత్తగా ఉండండి : వాతావరణం మారింది

  • Published By: madhu ,Published On : February 9, 2020 / 08:23 AM IST
జాగ్రత్తగా ఉండండి : వాతావరణం మారింది

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కూడా కురిసింది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు నుంచి ఛత్తీస్ గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో 2020, ఫిబ్రవరి 09వ తేదీ ఆదివారం, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 

జిల్లాల్లో…
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున జిల్లాలోని కూసుమంచి పరిసరాల్లో భారీ వర్షం పడింది. దీంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి మొత్తం తడిసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణం కావడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోసం వేల రూపాయల పెట్టుబడి పెట్టామని, పంట చేతికొచ్చిన సమయంలో వర్షం తీరని నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 

జయశంకర్ భూపాల జిల్లాలో..
జయశంకర్ భూపాల జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. మహదేవపూర్, పలిమేల, మహముత్తారం, కాటారం మల్హర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మిర్చితో పాటు వరి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 

మిర్యాలగూడ..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అకాల వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొర్లింది. చెరువులు కుంటల్లో కి వరద నీరు చేరి సమీప ప్రాంతాలపంట పొలాల్లోకి వరద నీరు ప్రవహించింది. పొలాలు వ్యవసాయ విద్యుత్ మోటార్లు నీటమునిగడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. 
 

ఏపీలో…
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. కోస్తాతో పాటు… ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. తమిళనాడు నుంచి కోస్తా తీరం మీదుగా, ఒడిశా వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడటంతో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోసర్తు వర్షం కురుస్తోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో చలిగాలులతో కూడిన వర్షం పడడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 

ప్రకాశం జిల్లా..
ప్రకాశం జిల్లా కనిగిరిలో తెల్లవారు జాము నుంచి వర్షం కురుస్తోంది. అకాలవర్షంతో రైతాంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.    పండించిన పంట పూర్తిగా తడిసి ముద్దయి పోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిగిరిలో.. కంది పూత దశలో ఉంది. అకాల వర్షంతో పూర్తిగా కంది పంట పూర్తిగా దెబ్బతింది.