శ్రీశైలంలో గొడ్డు మాంసం, మద్యం : రాజాసింగ్ ఆరోపణలు, వార్నింగ్ ఇచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి

శ్రీశైలంలో గొడ్డు మాంసం, మద్యం : రాజాసింగ్ ఆరోపణలు, వార్నింగ్ ఇచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి

Raja Singh Vs Shilpa Chakrapanireddy : శ్రీశైలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆరోపణల్ని నిరూపించకుంటే రాజాసింగ్ రాజీనామా చేస్తాడా అంటూ శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీశైలం క్షేత్రంలో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని… దీని వెనక కర్నూల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

రజాక్‌‌ను రంగంలోకి దింపి అక్రమాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. హిందూత్వాన్ని అడ్డంపెట్టుకొని ఏపీలో పైకిరావాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. గ్రేటర్‌లో బీజేపీ మతాల్ని రెచ్చగొట్టి గెలిచినట్లు.. ఏపీలో కూడా చేయాలని చూస్తే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు.

శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తొలగించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి తన టీమ్‌ను తయారు చేసి, వైసీపీ నేత రజాక్‌కు బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు రాజాసింగ్. శ్రీశైలంలో గొడ్డు మాంసం, మద్యం కూడా అమ్ముతున్నారని, ఈ విషయంపై బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చక్రపాణిని కట్టడి చేసి.. శ్రీశైల క్షేత్రాన్ని కాపాడాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.