గోదావరి జిల్లాల్లో భారీ బెట్టింగ్స్ .. కోడి పందాల్లో బిజీబిజీ! 

  • Published By: sreehari ,Published On : January 14, 2020 / 07:37 AM IST
గోదావరి జిల్లాల్లో భారీ బెట్టింగ్స్ .. కోడి పందాల్లో బిజీబిజీ! 

సంక్రాంతి వచ్చేసింది.. కోడి పందాలు జోరుందుకున్నాయి. సంక్రాంతి అనగానే ఉభయ గోదావరి జిల్లాలో ముందుగా గుర్తుచ్చేది కోడిపందాలే. ఈ కోడిపందాలను చూసేందుకు ఎక్కడి నుంచి వందలాది మంది తరలివస్తుంటారు. ప్రతి సంక్రాంతికి సాంప్రదాయంగా నిర్వహిస్తున్న కోడి పందాలను ఎంతో అట్టహాసంగా జరుపుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.  మరోవైపు పోలీసులు సైతం ఈ కోడి పందాలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

అయినా ఈ కోడి పందాల జోరు ఎంతమాత్రం వెనక్కితగ్గేలా కనిపించడం లేదు. టీ20 క్రికెట్ మ్యాచ్ లను తలదన్నేలా కోడి పందాలు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో పందాల్లో పాల్గొనేందుకు కోళ్లన్నీ బరి గీస్తున్నాయి.. నువ్వా నేనా సై అన్నట్టుగా కాలు దువ్వబోతున్నాయి. పందెం రాయుళ్లు కూడా తమ కోళ్లను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.

సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజుల పాటు ఈ కోడి పందాల ఉత్సవాలు జరుగనున్నాయి. గోదావరి జిల్లాల్లో కోడిపందాలే స్పెషల్ ఎట్రాక్షన్.. సరదా కోసమే కాదు.. ఇదొక సంప్రదాయంగా ఎన్నో యేళ్ల నుంచి వస్తోంది. ఇప్పుడు బెట్టింగ్ కోసం ప్రత్యేకించి కోళ్లను సిద్ధం చేస్తున్నారు. 1996 నుంచి కోళ్ల పందాల్లో చాలా మార్పు వచ్చింది. భారీగా కోడి పందాలు నిర్వహించడంతో ప్రతి ఏటా కోట్లాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి.

కోడి పందాలకు భీమవరం ప్రసిద్ధి :
సంక్రాంతి పండగ.. కోడి పందాలు అనగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చేది భీమమరం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ భీమవరంలో జరిగే కోడిపందాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ప్రత్యేకించి రాజకీయ, పారిశ్రామిక రంగాలవారితో పాటు ఎందరో సినీ ప్రముఖులు సైతం ఇక్కడికే వస్తుంటారు. ఎక్కడెక్కడో ఉండే పొరుగువారంతా సంక్రాంతికి తప్పకుండా భీమవరం రావాల్సిందే.. కోడి పందాలు చూడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.

3 రోజులు సందడే సందడి :
గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి అంతాఇంతా కాదు.. ఎక్కడికి వెళ్లినా ఒకవైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు కోడి పందాలతో కన్నుల పండువగా కనిపిస్తుంది. ఎక్కడా చూసిన పొలాల్లో టెంట్లు, షామియనాలు, పందెం రాయుళ్ల చంకల్లో కోడి పుంజులు, ఫ్లడ్ లైట్ కాంతుల్లో కత్తులు దూసే పందెం కోళ్లతో కనిపిస్తుంటారు. పేకాట రాయుళ్లు, గుండాట, కోడి పకోడి, కోడి పలావ్ లతో విందు కార్యక్రమాలు, మద్యం.. అబ్బో సంక్రాంతికి నిండుదనం వచ్చేలా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

ఒక్కసారి ఈ గోదావరి జిల్లాలకు సంక్రాంతి సమయంలో వచ్చినవారు మళ్లీ మళ్లీ రాకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సంక్రాంతి వేడుకల్లో కోడి పందాల కోసం పుంజులను సెలెక్ట్ చేస్తారు. ఒక్కో పుంజు రూ. 5వేల నుంచి రూ. లక్షకు పైగా ధర పలుకుతుంది. ఇక పందెంలో గెలిచిన కోడిపుంజు కంటే.. ఓడిపోయిన పుంజుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.. ఎగబడి కొనేందుకు పోటీపడుతుంటారు. ఓడిన కోడిపుంజును వండి ఆ కూరను అతిథులకు పంపడం ఆనవాయితీగా వస్తోంది.