టీడీపీకి షాక్ : ఇద్దరు మాజీ మంత్రులపై సీఐడీ కేసులు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ... టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 07:19 AM IST
టీడీపీకి షాక్ : ఇద్దరు మాజీ మంత్రులపై సీఐడీ కేసులు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ… టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ… టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. రాజధాని ప్రాంతంలో భూ అక్రమాలపై ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ రంగంలోకి దిగింది. భూ అక్రమాలపై విచారణ చేపట్టిన సీఐడీ.. టీడీపీకి షాక్ ఇచ్చింది. ఇద్దరు మాజీ మంత్రులపై కేసులు బుక్ చేసింది. వారిలో ఒకరు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాగా… మరొకరు నారాయణ. వీళ్లిద్దరూ… అసైన్డ్ భూములను కొన్నట్లుగా సీఐడీ చెబుతోంది. రూల్ ప్రకారం అసైన్డ్ భూములను ప్రభుత్వమే కొన్ని వర్గాలకు ఇస్తుంది. వారి నుంచి ఎవరూ కొనకూడదు. కానీ.. పుల్లారావు, నారాయణలు అసైన్డ్ భూములు కొన్నట్లుగా సీఐడీ చెబుతోంది.

కేసులు నమోదు కావడంతో ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. భూములు కొన్నారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సీఐడీ చెబుతున్నట్లు నిజంగానే అసైన్డ్ భూములు కొనుంటే… వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అమరావతి ప్రాంతంలో తెల్లరేషన్ కార్డు దారులు భూములు కొనుగోలు చేసిన షాకింగ్ విషయం సీఐడీ విచారణతో తెలిసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 761 ఎకరాల భూములు కొన్నట్లు సీఐడీ చెబుతోంది. వీళ్లందరిపై కేసు నమోదు చేసింది. ఎకరం రూ.3 కోట్ల చొప్పున మొత్తం 761 ఎకరాలు కొన్నారనీ… అలా… మొత్తం 796 మంది వైట్ రేషన్ కార్డు ఉన్నవారు… రూ.300 కోట్లతో భూములు కొన్నారని సీఐడీ గుర్తించింది. వీళ్లతో భూములు ఎవరు కొనిపించారో లెక్కలు రాబడుతోంది. మంగళగిరి, తుళ్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి వారి వివరాలు సేకరించారు అధికారులు.

నెలకి రూ.5వేలు ఆదాయం కూడా రాని తెల్ల రేషన్ కార్డుదారులు రూ.300 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేయడం షాక్ కి గురి చేసింది. తుళ్లూరు, తాడికొండ, పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, అమరావతి ఏరియాల్లో భూములు కొన్నట్టుగా సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. అత్యధికంగా తుళ్లూరులో 245 ఎకరాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 

తెల్ల రేషన్ కార్డుదారులపై చీటింగ్, బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డుదారుల వివరాలు, ఆధార్ కార్డులు, అడ్రస్ లు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు పంపారు. ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసుకున్నారు ఐటీ అధికారులు.

అసైన్డ్ భూములు కొనుగోలు ఆరోపణలపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. భూములు కొనుగోలు చేయలేదని చెప్పారు. మేము ఏ చాలెంజ్ కైనా సిద్దంగా ఉన్నామన్నారు. నారాయణ, తనపై కక్షపూరితంగా కేసులు నమోదు చేశారని ప్రత్తిపాటి ఆరోపించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తమకు తెలియదన్నారు. సెంటు అసైన్డ్ భూమి కూడా తాను కొనలేదన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు.

Also Read : అమరావతిలో షాకింగ్ : 797మంది తెల్ల రేషన్ కార్డుదారులు.. 761ఎకరాల భూములు కొనుగోలు