Tirumala : తిరుమలలో బయోడీగ్రేడబుల్ కవర్ల విక్రయాలు ప్రారంభం

నూతనంగా తయారు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రాన్ని ఆదివారం తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద ప్రారంభించారు.

Tirumala : తిరుమలలో బయోడీగ్రేడబుల్ కవర్ల విక్రయాలు ప్రారంభం

Tirumala (2)

Tirumala : పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించిన విషయం తెలిసిందే. డీఆర్‌డీవో నూతనంగా తయారు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రాన్ని ఈరోజు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద డీఆర్‌డి‌ఓ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి ఈకౌంటర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డి ఆర్ డిఓ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ…. హైదరాబాద్ లోని క్షిపణి ప్రయోగ కేంద్రంలోని అడ్వాన్స్ సిస్టమ్స్ లేబొరేటరీ అనేక రకాల ప్రయోగాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం, పశువులకు ప్రాణ హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్ల కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ కవర్ల తయారీపై పరిశోధనలు చేసిందన్నారు. మొక్కజొన్న వ్యర్థాలతో సంచులు తయారుచేసి, వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి మేలు కలుగుతుందని పరిశోధనలు చేసిందన్నారు.

ప్లాస్టిక్ కవర్లకు ఇది పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం అని నిరూపణ అయ్యాక వీటి తయారీకి ఆమోదం తెలిపిందన్నారు. ఈ కవర్లను పశువులు తిన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఇవి 90 రోజుల్లోనే పూర్తిగా భూమిలో కలసి పోతాయని ఆయన చెప్పారు. ఇవి పాలిథిన్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని సతీష్ రెడ్డి చెప్పారు.

టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందన్నారు. ప్రసాదాల పంపిణీ కోసం బట్ట, జ్యుట్ బ్యాగులు విక్రయిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ మంత్ర సంస్థ పర్యావరణ హిత కవర్లు విక్రయిస్తోందని తెలిపారు.
డి ఆర్ డిఓ తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయాలు తిరుమలలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. భక్తుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి లభించిన వెంటనే ఈ కవర్లు మరింతగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు.