ప్రకాశం జిల్లాలో ఆలయం గాలిగోపురంపై పక్షులు మృతి, భయాందోళనలో స్థానికులు

ప్రకాశం జిల్లాలో ఆలయం గాలిగోపురంపై పక్షులు మృతి, భయాందోళనలో స్థానికులు

bird flu tension in prakasam district: ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పామూరు మండలం అయ్యవారి పల్లెలోని దేవాలయం పైనున్న గాలిగోపురం దగ్గర ఆరు పక్షులు చనిపోవడం ఆందోళనకు దారి తీసింది. పక్షులు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక దాని తర్వాత ఒక పక్షి గాలి గోపురం నుంచి కిందపడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చనిపోయిన పక్షులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చనిపోయిన వాటిలో ఆరు పిచుకలు, ఒక కాకి ఉన్నాయి. ముందుగా నిన్న(జనవరి 29,2021) కాకి చనిపోయింది. ఆ తర్వాత పిచుకలు వరుసగా మృత్యువాత పడ్డాయి. దీంతో గ్రామస్తులకు భయం పట్టుకుంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రకంపనలు రేపుతోంది. ఈ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో కోళ్లను చంపేశారు. వైరస్ గుర్తించిన ప్రాంతాల్లో కిలోమీటర్ రేడియస్ పరిధిలో పౌల్ట్రీలలోని కోళ్లను చంపేస్తున్నారు. కోళ్లను సంచుల్లో మూటగట్టి గోతిలో పాతి పెడుతున్నారు.

రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ వెలుగు చూసిన నాటి నుంచి జనవరి 27వ తేదీ వరకు మృతిచెందిన పక్షుల సంఖ్య 6వేల 937కి చేరింది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్టు గుర్తించారు. డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు రాజస్థాన్‌లో 6వేల 937 పక్షులు మృత్యువాత పడగా.. వీటిలో 4వేల 853 కాకులు, 413 నెమళ్లు, 593 పావురాలు, 1,078 ఇతర పక్షులు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.