హ్యాపీ బర్త్ డే చంద్రబాబుగారూ

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2019 / 01:38 AM IST
హ్యాపీ బర్త్ డే చంద్రబాబుగారూ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(ఏప్రిల్-20,2019)70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్- 20,1950న జన్మించిన చంద్రబాబు  శనివారం 69వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రముఖ రాజీకీయనాయకులు, పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు,కార్యకర్తలు బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబునాయుడుని కేవలం ప్రజాప్రతినిధిగానే కాదు.. విజనరీ ఉన్న నేతగానూ దేశం గుర్తించింది. ఇంత సుదీర్ఘ కాలం రాజకీయ కెరీర్.. కీలక స్థానాల్లోనే ఉంటూ కొనసాగించడం ఆషామాషీ విషయం కాదు. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి 21వ శతాబ్దపు విజనరీ లీడర్‌ గా ఎదిగిన  ఏపీ సీఎం  చంద్రబాబు పై ఓ ప్రత్యేక కథనం.
1950, ఏప్రిల్-20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె గ్రామంలో నారా ఖర్జూర నాయుడు,అమ్మణమ్మ దంపతులకు చంద్రబాబు జన్మించారు. చిన్నతనం నుంచే చంద్రబాబులో నాయకత్వ లక్షణాలు ఉండేవి.ఎస్పీ యూనివర్శిటీలో చంద్రబా బు విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.1978లో తొలిసారిగా చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్(ఐ)అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు.తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబుకి మంత్రిపదవి అభించింది.దివంగత సీఎం టి.అంజయ్య మంత్రివర్గంలో టెక్నికల్ ఎడ్యుకేషన్,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీలో 28 ఏళ్లకే మంత్రి పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత చంద్రబాబునాయుడు సొంతం. అప్పటికి ఆయన వివాహం కూడా కాలేదు. మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబకు ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిగింది. 1983 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు  కాంగ్రెస్ ను వీడి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు.ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ లో చంద్రబాబు తెలివితేటలు ఎన్టీఆర్ ను మళ్లీ సీఎంను చేశాయి.

1989 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 5వేల ఓట్ల మెజార్టీతో చంద్రబాబు విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీ రాజకీయాలతో తన ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబునాయుడు.. అనేక ఎత్తు పల్లాలను చూశారు. కాంగ్రెసు పార్టీలో సర్వసాధారణంగా ఉండే గ్రూపు కక్షలు, ముఠా వివాదాలు ఆయనను తొలినుంచి ముసురుకునే ఉన్నాయి. వాటిని అధిగమించడంలో ఆయన ఎన్నో వ్యూహాలను, చాణక్య సమీకరణాలను తొలినుంచి అలవాటు చేసుకుంటూ వచ్చారు.

టీడీపీలో తల్లెత్తిన అనూహ్య పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో సెప్టెంబర్-1,1995న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.1999 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో అక్టోబర్-11,1999న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2003, అక్టోబర్ లో తిరుమల వెళ్తుండగా నక్సలైట్లు జరిపిన దాడి నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు.ఈ సమయంలో ఆయన ఏడాది సమయం మిగిలి ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 9ఏళ్ల సుదీర్ఘ పరిపాలనతో  ఆయన రికార్డు సృష్టించారు.ఈ సమయంలో జాతీయరాజకీయాల్లో కూడా చంద్రబాబు పేరు మార్మోగిపోయింది. హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో ఆయన కృషి చాలా ఉంది.విజనరీ లీడర్ గా జాతీయనాయకులు చంద్రబాబుని ప్రశంసించేవారు.ఆధునిక సాంకేతికతో పాటు అప్ డేట్ కావడం.. కొత్త సాంకేతికతను ఎలా వాడుకోవాలో వేగంగా అంచనా వేయగలగడం ఆయన గొప్ప విజనరీగా ఆయన్ను చెబుతారు.


 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.కాంగ్రెస్ కూటమి విజయం సాధించి వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో ఓటమి పాలై పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నారు. పదేళ్లు అధికారంలో లేని ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశం శ్రేణులు జారిపోకుండా పార్టీని కాపాడుకున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది.విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చరిత్రలో అతిసుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనతను, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర  పునాదుల్లో అరుదైన అవకాశాన్ని సొంసొంతం చేసుకున్నారు చంద్రబాబు.