సెలబ్రెటీల వైపు BJP చూపు..పవన్‌ కళ్యాణ్‌తో బలం పెరుగుతుందా

  • Published By: madhu ,Published On : January 17, 2020 / 06:54 AM IST
సెలబ్రెటీల వైపు BJP చూపు..పవన్‌ కళ్యాణ్‌తో బలం పెరుగుతుందా

ఏడాది క్రితం వరకూ దేశవ్యాప్తంగా బలంగా కనిపించిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం అతి తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది కాషాయ పార్టీ. ప్రధానంగా సెలబ్రెటీల వైపు చూస్తోంది. అందులో భాగంగానే ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను చేరదీసినట్లు టాక్. 

జనాకర్షణ ఉన్న నేతలు లేకపోవడంతో బీజేపీ తన బలాన్ని పెంచుకోలేకపోతోంది. తెలంగాణలోనూ ఆ పార్టీది అలాంటి పరిస్థితే. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోనూ అదే తంతు. అందుకే జనాకర్షణ ఉన్న నేతలను ఎంపిక చేసుకుంటూ వారికి అండగా నిలబడే ప్రయత్నం ముమ్మరం చేసింది. మొన్నటి ఎన్నికల్లో కర్ణాటకలో నటి సుమలత ఎంపీగా గెలవడంలో తన వంతు సహకారాన్ని అందించింది బీజేపీ. ఆమెను దగ్గరకు చేర్చుకుంది. అలానే ఇటీవల కాలంలో జరుగుతోన్న వివిధ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులను కలుసుకోవడం సాధారణ విషయమైపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సినీ ప్రముఖులతో కలవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడైంది. అదే దిశగా ఇప్పుడు ఏపీలో కూడా పవన్‌ కళ్యాణ్ను అక్కున చేర్చుకుంటోంది.

తమిళనాడులో కూడా ఇదే విధంగా ప్రయత్నాలు చేసింది. కొన్నాళ్లు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో దోస్తీకి ట్రై చేసింది. కొంత కాలం పాటు రజనీకాంత్‌ కూడా బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. కానీ, ఆ పార్టీలో చేరేందుకు సిద్ధపడలేదు. తానే సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు సూపర్‌స్టార్‌. చివరి క్షణాల్లో తమకు హ్యాండ్‌ ఇవ్వడంతో తమిళనాడులో ప్రస్తుతానికి తమ ప్రయత్నాలకు కామా పెట్టారు కమలనాథులు. ఈలోపు ఏపీలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా రక్తి కట్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన మూడు రాజధానుల అంశం మంట పుట్టిస్తోంది. 

ఇక్కడ పాగా వేయాలంటే బలంగా దూసుకు రావాలి. పవన్‌ కళ్యాణ్‌ బొమ్మతో ఆ పని సులువు అవుతుందని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని ప్రజలు భావిస్తున్నారనే ఉద్దేశంలో బీజేపీ, జనసేన ఉన్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఈ రెండు పార్టీలు కలసి పనిచేయబోతున్నాయి. కానీ, పవన్‌కు, బీజేపీకి ఉన్న ఓటింగ్‌ శాతంతో ఈ ఆశలు నెరవేరాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.

ముఖ్యంగా పవన్‌ వ్యవహార శైలి బీజేపీకి ఎంత వరకూ కలిసొస్తుందన్నదే ప్రశ్నార్థకం. ఏమీ సాధించకుండానే బీజేపీతో కలిసి వెళ్లాలనుకోవడం ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు తీసుకెళ్తాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఏపీలో బలపడాలని, వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఆపరేషన్ కమలానికి తెరతీసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక.. టీడీపీ, జనసేనలకు చెందిన నేతలకు కమలం పార్టీ వల విసిరింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమవైపు తిప్పుకుంది.

సమయానికి అనుగుణంగా వ్యూహాలను మార్చుకునే బీజేపీ.. ఏపీకి చెందిన రాజకీయ పార్టీలతో వ్యవహరిస్తున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. నిజానికి రాష్ట్రంలో జనసేనతో పోల్చి చూస్తే టీడీపీయే బలంగా ఉంది. ఆ పార్టీకి సంస్థాగతంగా బలమైన కేడర్‌ ఉంది. ఎన్నికల తర్వాత కొంత మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయినా కేడర్‌ మాత్రం చెక్కుచెదరలేనే చెప్పుకోవచ్చు. బీజేపీ కావాలనుకుంటే టీడీపీతో కలసి వెళ్లవచ్చు. కానీ, ఎన్నికల వేళ మోదీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ నేతలకు ఇప్పటికీ ఆయనంటే కోపం ఉంది. చంద్రబాబుతో ఇక కలిసే ప్రసక్తే లేదని, శాశ్వతంగా తలుపులు మూసుకు పోయాయని బీజేపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. మొత్తానికి ఏపీ రాష్ట్రంలో జెండా పాతాలంటే ఫేస్‌ వాల్యూ ఉన్న నాయకుడు అవసరమని భావించింది బీజేపీ. పవన్‌తో కలసి వెళ్లినంత మాత్రాన పార్టీ బలం పుంజుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

Read More : పవన్ కళ్యాణ్ ఇమేజ్ బీజేపీకి కలిసొస్తుందా