వైసీపీ, టీడీపీ కాదన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు

వైసీపీ, టీడీపీ కాదన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు

privatization of the Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సమర్థించారు. మాస్టర్‌ పాలసీలో భాగంగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యాపారాలు చేయడం ప్రభుత్వ విధానం కాదని తెలిపారు. ఇది వైసీపీనో లేకపోతే తెలుగుదేశం పార్టీనో విభేదిస్తే ఆగిపోదన్నారు. ప్రైవేటీకరణ వలన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎక్కడికి వెళ్ళదని, అక్కడే ఉంటుందని తెలిపారు. వేరే రాష్ట్రానికో లేక వేరే దేశానికో తరలిపోదన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రాణాలు అర్పించి స్టీల్‌ ప్లాంట్‌ తెచ్చారని వారందరినీ గుర్తు చేసుకోవాలన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. విశాఖలో కార్మికలోకం కదం తొక్కింది. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌ నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో రైతు ఉద్యమం కంటే తీవ్రంగా పోరాడతామని కార్మికులు హెచ్చరించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పార్లమెంట్‌లో పోరాడతామని వైసీపీ ఎంపీలు ఎం.వి.వి సత్యనారాయణ, కె.సత్యవతి అన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన స్టీల్‌ ప్లాంట్‌ను…ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీరతామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ చెప్పారు.

కరోనాతో ఆర్థికవ్యవస్థ కుదేలైందన్న సాకుతో వేల కోట్లు లాభాలు ఆర్జించిన స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేయాలనుకోవడం తగదని అనకాపల్లి ఎంపీ కె.సత్యవతి హితవుపలికారు. ప్రైడ్‌ ఆఫ్‌ ఏపీగా నిలిచిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పార్లమెంట్‌లో సహచర ఎంపీలతో కలిసిపోరాడతామన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న కార్మికులకు ఎంపీలిద్దరూ సంఘీభావం తెలిపారు.