ఏపీలో 4 రాజధానులు…సీఎం జగన్ చెప్పారంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2019 / 11:59 AM IST
ఏపీలో 4 రాజధానులు…సీఎం జగన్ చెప్పారంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని, ఆ విషయాన్ని వాళ్లే తనకు చెప్పారన్నారు. ఈ అంశంపై కేంద్రంతో వైసీపీ నేతలు కూడా చర్చలు జరిపారన్నారు. ఏపీలో 4 రాజధానులు పెట్టే యోచనలో జగన్‌ ఉన్నట్లు టీజీ చెప్పారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో డిప్యూటీ సీఎంలను జగన్ నియమించారన్నారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు.

అమరాతి రైతుల భూములు వెనక్కి తిరిగి ఇచ్చేస్తామంటూ జగన్ ఎన్నికలకు వెళ్లారని తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం ముందుకు వెళ్తున్నారన్నారు. ఆయన చేసే పనిని ప్రజలు హర్షిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

అమరావతిని ఫ్రీజోన్‌ చేయాలని గతంలో అడిగామని టీజీ గుర్తు చేశారు. అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి జరిగి ఉంటే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయేవారు కాదన్నారు. అమరావతి మీదే దృష్టి పెట్టడంతో ఎన్నికల్లో టీడీపీ సహా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూడా ఓడిపోయారని టీజీ అన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ విడిపోవడం ఖాయమన్నారు.

పెట్టుబడుల వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. గోదావరి నీళ్లను శ్రీశైలానికి ఇస్తామనడం హాస్యాస్పదమని చెప్పారు. మరోవైపు తెలంగాణ సీఎంపైనా టీజీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌తో స్నేహం చేస్తే జగన్ కలిపోతారన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపడం మంచిది కాదన్నారు.