రాజధాని సెగలు : పార్టీ రంగును చెరిపేసి..నల్లరంగు వేసిన కార్యకర్తలు

  • Published By: madhu ,Published On : December 21, 2019 / 06:03 AM IST
రాజధాని సెగలు : పార్టీ రంగును చెరిపేసి..నల్లరంగు వేసిన కార్యకర్తలు

రాజధాని మార్పుపై అధికార పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తోంది. రాజధాని అంశంపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక మరింత ఉద్రిక్తతను పెంచింది. మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై రాజధాని ప్రజలు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వేసిన పార్టీ రంగులను వైసీపీ కార్యకర్తలే తుడిచేస్తున్నారు.

దీంతో కార్యకర్తలకు గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. పంచాయతీ ఆఫీసుకి నల్ల రంగు వేయడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులను తోసేసి మరీ పంచాయతీ ఆఫీసుకి నల్లరంగు వేస్తున్నారు రైతులు. గ్రామస్తులకు మధ్య జరిగిన తోపులాట కారణంగా పోలీసులపై నల్లరంగు పడింది. 

మరోవైపు…మూడు రాజధానులు.. నాలుగు కమిషనరేట్లు అనే కాన్సెప్ట్‌పై రాజధాని ప్రాంత రైతులు భగ్గుమంటున్నారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాయపూడిలో సీడ్‌యాక్సిస్‌ రోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చుని నిరసన తెలిపారు. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మార్చడంపై నిరసనగా వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో మహాధర్నా నేపథ్యంలో రైతులు వాహనాలను రోడ్డుకు అడ్డంగా ఉంచారు. దీంతో సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేస్తున్నారు. 
మంగళగిరి మండలం కోరగల్లులోనూ నిరసనలు భగ్గుమన్నాయి. స్థానికులంతా కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై కూర్చుని ఆందోళన చేస్తున్నారు. నీరుకొండ కొండవీటివాగు వంతెన వద్ద రైతులు ఆందోళన చేశారు. రైతుల ధర్నాతో కిలోమీటరు మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Read More : సీఎం జగన్‌కు నారా లోకేశ్ విషెస్