సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడింది

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 11:09 AM IST
సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడింది

bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటంతో వైసీపీ నిద్ర లేచిందని బోండా ఉమ అన్నారు. 18 నెలల జగన్ పాలనలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. చంద్రబాబు కట్టిన 8 లక్షల ఇళ్లను ఉచితంగా పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 30లక్షల మందికి సెంటు భూమి అని చెప్పి వైసీపీ మోసం చేసిందన్నారు బోండా ఉమ.

టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని పోరాటం:
టీడీపీ హయాంలో నిర్మించి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలంటూ టీడీపీ పోరాటం చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌)- హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకాన్ని రాష్ట్రాల్లో అమలు పరుస్తోంది. టీడీపీ హయాంలో ఈ హౌసింగ్‌ కాలనీలకు ఎన్టీఆర్‌ నగర్‌ అని పేరు పెట్టగా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్‌ నగర్లుగా మార్చింది. ఈ పథకం కింద కేంద్రం ఏపీలో పట్టణ పేదల కోసం 7,58,788 గృహాలను (టిడ్కో గృహాలు) టీడీపీ హయాంలో మంజూరు చేసింది. వీటిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2,62,216లను గ్రౌండ్‌ చేయించి, నిర్మాణాన్ని చేపట్టడంతో దాదాపుగా అన్నీ గృహ ప్రవేశాలకు సిద్ధమైన దశల్లో ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలా పూర్తయిన వాటిని వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలంటూ టీడీపీ నేతలు పోరాటం చేస్తున్నారు.

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపణ:
అసలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా టీడీపీ నేతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్లకు చంద్రబాబు పదే పదే అడ్డు పడుతున్నారని మండిపడుతున్నారు. కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే పేదలకు మంచి జరుగుతుందని చెప్పారు. కోర్టుల్లో ఉన్న కేసుల స్టేను చంద్రబాబు వేకేట్ చేస్తే డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజున టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని ఇటీవల ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్లు రాకుండా రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారని చంద్రబాబుపై కొడాలి నాని ఇటీవల మండిపడ్డారు.

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్:
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పేదలందరికీ ఇళ్లు.. పథకం కింద పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీకి జగన్ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే పలుమార్లు వివిధ కారణాల వల్ల ఈ పంపిణీ వాయిదా పడగా, ఈ సారి డిసెంబర్ 25న పేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టులో స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్‌ 25న అర్హులకు డి-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల 68వేల 281 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.


https://10tv.in/mp-margani-bharat-on-local-body-elections/
కోర్టు కేసులు లేని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ:
ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం మొదట జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పేదలకు ఆ స్థలాలు అప్పగించాలని భావించింది. అయితే, అప్పట్లో కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఆగస్టు 15కు ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి టీడీపీ అభ్యంతరాలు చెబుతూ కోర్టుకు వెళ్లింది. అలాగే, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులు కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు తూర్పుగోదావరి జిల్లా ఆవ భూముల విషయంలో కూడా వివాదం తలెత్తడంతో వాయిదా పడింది. తాజాగా, కోర్టు కేసులు, భూ వివాదాలు లేని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.