Book Festival: స్వరాజ్య మైదానంలో పుస్తక ప్రియుల కోసం బుక్ ఫెస్టివల్!

విజయవాడ బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానంలో 32వ పుస్తకం మహోత్సవానికి పుస్తక ప్రియుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

Book Festival: స్వరాజ్య మైదానంలో పుస్తక ప్రియుల కోసం బుక్ ఫెస్టివల్!

Book Festival

Book Festival: ఇంటర్నెట్ యుగం శాసిస్తున్నా…పుస్తకంపై ప్రేమ మాత్రం తగ్గట్లేదు.. నిత్యం మొబైల్ ఫోన్‌లో మునిగే జనానికి పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గట్లేదు. పగిలినా ఫోన్‌ అయినా ఉంచుకుందాం కానీ, మంచి పుస్తకం కొనుక్కుందాం అంటూ జనం బుక్‌ ఫెస్టివల్‌కు తరలివస్తున్నారు. విజయవాడలో 32వ పుస్తక మహోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. పుస్తకాలతోపాటు చిన్నారులకు వినోదాన్ని, పెద్దలకు ఆలోచనా విధానం వైపు నడిపించేలా బుక్‌ ఫెస్టివల్ జరుగుతోంది.

విజయవాడ బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానంలో 32వ పుస్తకం మహోత్సవానికి పుస్తక ప్రియుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రతి ఏడాది జనవరి నెలలో బెజవాడలో పుస్తక మహోత్సవ వేడుకలు 11 రోజులపాటు నిర్వహిస్తూ వస్తున్నారు. గత రెండున్నర దశాబ్దాలకుపైగా దిగ్విజయంగా బుక్ ఫెస్టివల్ కొనసాగుతోంది.

దేశ నలుమూలల నుంచి ఈ పండుగకు పుస్తకాభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఈసారి కొత్త ఏడాది ప్రారంభం రోజు నుంచే పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేలా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న మొదలైన బుక్ ఫెస్టివల్ 11వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రముఖ తెలుగు ప్రచురణ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ప్రముఖ ఇంగ్లీష్ ప్రచురణ సంస్థలు హిమాలయ పబ్లిషింగ్ హౌస్, నవనీత్, కళ్యాణ్ లాంటివి తరలివచ్చేశాయి. ప్రభుత్వ ముద్రణ సంస్థలు సైతం బుక్ ఫెస్టివల్‌లో పాలుపంచుకున్నాయి.

Warangal : కాకతీయ కెనాల్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

ఈసారి 210 స్టాళ్లను ఏర్పాటు చేయగా.. మొత్తం 7 లక్షలకుపైగా పుస్తకాలు అందుబాటులో ఉంచారు. వీటిలో మేలిమి సాహిత్యం, రచనలు ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. సాహిత్యం, నవలలు, వ్యక్తిత్వ వికాసం, భారత రామాయణాలు, భగవద్గీత సహా అన్ని రకాల పుస్తకాలున్నాయి. తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాల వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు, మెడికల్, ఇంజనీరింగ్ సహా అన్ని పాఠ్యపుస్తకాలున్నాయి. ఇక ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీ ఇస్తున్నారు.

ప్రతిరోజు సాహిత్య, ప్రతిభా వేదికలపై పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు చిత్రలేఖనం, జానపద నృత్య ప్రదర్శనలు, చర్చా కార్యక్రమాలు, కథలు, కవిత్వాలు రాయించడం లాంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతిరోజు పుస్తక ప్రదర్శన ఆకట్టుకుంటోంది. పుస్తకంతో వచ్చిన జ్ఞానం తుడిచిపెట్టలేనిది..అందుకే విజయవాడ పుస్తక మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్నారు.